Somireddy Chandra Mohan Reddy: ఈ రోజుకి కుక్కే గెలిచింది... కాకాణీ నిన్ను మాత్రం వదిలేది లేదు: సోమిరెడ్డి

  • కోర్టు ఫైళ్ల చోరీ కేసులో మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్ 
  • ఒరిజినల్ కేసులో మాత్రం కాకాణి తప్పించుకోలేడన్న సోమిరెడ్డి
  • నువ్వు దొంగవి అంటూ వ్యాఖ్యలు
Somireddy take a jibe at minister Kakani Govardhan Reddy

కోర్టులో ఫైళ్ల చోరీతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. నాడు కుక్క మొరగటం వల్లే దొంగలు భయపడి కోర్టు రూమ్ లో దాక్కునేందుకు వెళ్లారని, వారు అక్కడి బీరువా తెరిచి ఫైళ్లు చోరీ చేశారని 2022 ఏప్రిల్ 17న అప్పటి నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు చెప్పగా, ఆయన వాదననే బలపరుస్తూ సీబీఐ తన చార్జిషీట్ లో అదే అంశాన్ని పొందుపరిచింది. 

అయితే, మంత్రి కాకాణిపై తీవ్రస్థాయిలో న్యాయ పోరాటం చేస్తున్న టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనిపై మండిపడ్డారు. కాకాణికి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజుకి కుక్కే గెలిచింది... కానీ, నేను పెట్టిన కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేడని సోమిరెడ్డి స్పష్టం చేశారు. 

"కాకాణీ... నేను పెట్టిన ఒరిజినల్ కేసులో అంతిమంగా నీకు జైలు తప్పదు. నీ బ్యాంకు అకౌంట్లు, నీ తప్పుడు బ్యాంకు అకౌంట్లు, నీ కుటుంబం బ్యాంకు అకౌంట్లు, నీ వీసాలు, నీ తప్పుడు వీసాలు... హాంకాంగ్, సింగపూర్, మలేసియా, మరో దేశంలో నువ్వు బరి తెగించిపోయావు... ఇదీ నేను పెట్టిన ఒరిజినల్ కేసు. ఎక్కడికి పోతావు నువ్వు? భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు. 

ఏ కోర్టూ నీకు బెయిల్ ఇవ్వకపోతే చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి కండిషనల్ బెయిల్ తెచ్చుకున్నావు. రోజూ హెడ్ కానిస్టేబుల్ వద్దకు వెళ్లి సంతకాలు పెట్టే స్థాయి నీది. ఇవాళ్టికి కుక్కే గెలవొచ్చు. ఎస్పీ విజయరావు కూడా అదే చెప్పాడు. కుక్క తాను అనుకున్నదే చేయించింది... ఆ ఇద్దరు దొంగలు కుక్క చెప్పిన ఫైలే తీసుకువచ్చారు. కోర్టులోని కొన్ని వేల ఫైళ్లలో కాకాణి ఫైల్ ను దొంగతనం చేసేంత వరకు కుక్క ఒప్పుకోలేదట! 

అందులోని డేటా కూడా డిలీట్ చేయమని కుక్క ఏమైనా సూచనలు చేసిందో మాకు తెలియదు. రోడ్లపై దొంగతనాలు చేసుకునేవారికి కూడా ట్యాబ్ లో, ఫోన్ లో డేటా డిలీట్ చేయాలని కుక్కే ఆదేశాలు ఇచ్చిందేమో! నువ్వు కుక్కను నమ్ముకున్నావేమో కానీ, నేనైతే నన్ను నేను నమ్ముకున్నాను... నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏడేళ్లకు పైగా జైలు శిక్ష నువ్వు అనుభవించక తప్పదు... కాకాణీ... గుర్తుపెట్టుకో!

నోరు అదుపులో పెట్టుకో కాకాణీ... మాట్లాడితే చంద్రబాబునాయుడిపై నోరు పారేసుకోవద్దు. నువ్వు చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయి, అవి తర్వాత మాట్లాడదాం. కోర్టు ఫైళ్ల కేసులో నువ్వు సంకలు ఎగరేసుకుని, ఔట్లు కాల్చుకుని, మమ్మల్నందరినీ తిడితే నీకు క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు. నువ్వు దొంగవి, నువ్వు  ముద్దాయివి" అంటూ సోమిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

More Telugu News