Telugudesam: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

  • పెరిగిన ధరలపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన టీడీపీ
  • వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని
  • స్పీకర్ ఛైర్ వద్దకు వచ్చి ఆందోళన చేసిన టీడీపీ సభ్యులు
TDP MLAs suspended from AP Assembly

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని... ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే, టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు. 

మరోవైపు, టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు... బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ చదువుతున్న సమయంలో స్పీకర్ పోడియంలో టీడీపీ సభ్యులు ఈలల వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ... వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో, మార్షల్స్ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కూడా టీడీపీ సభ్యులు ఈలలు వేసుకుంటూనే బయటకు వెళ్లారు.

More Telugu News