Vasantha Krishnaprasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఎవరో రాసిచ్చిన ప్రశ్నలను సీఎం అడగడం కంటే అవమానం ఇంకేముంటుందన్న కృష్ణప్రసాద్ 
  • తాను ఏ పార్టీతోనూ చర్చించలేదన్న ఎమ్మెల్యే
  • మంత్రి జోగి రమేశ్ వ్యవహారశైలి గురించి చెబితే సర్దుకుపోవాలంటూ తనకే సూచించారని ఆవేదన
  • వైసీపీ నుంచి తాను పోటీ చేయడం సాధ్యం కాదని వెల్లడి  
Mylavaram MLA Vasantha Krishnaprasad made Interesting comments on YSRCP

వైసీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి జోగి రమేశ్ వ్యవహారశైలి గురించి చెబితే నియోజకవర్గంలో ఆయన జోక్యాన్ని నియంత్రించాల్సిన అధిష్ఠానం.. సర్దుకుపోవాలనే రీతిలో తనకు సూచించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. జిల్లాలో నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందని చెబుతూనే ఎవరో రాసిచ్చిన ప్రశ్నలను సీఎం అడగడం కంటే అవమానం ఇంకేముంటుందని ఆయన అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించానని, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేశానని ఆయన గుర్తుచేసుకున్నారు. 

అధిష్ఠానానికి నమ్మకం లేనప్పుడు, తానెలా పని చేయగలనంటూ కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి తాను పోటీ చేయడం సాధ్యం కాదని వసంత కృష్ణప్రసాద్ తేల్చి చెప్పారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మరొకరిని నియమించిన నేపథ్యంలో నందిగామ మండలం ఐతవరంలో ఎమ్మెల్యే నివాసంలో నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఏం చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయిద్దామని ఈ సమావేశంలో చెప్పినట్టుగా తెలిసింది.

కాగా తాను ఏ పార్టీతోనూ చర్చించలేదని, కొంతమంది లోకేశ్‌తో తనను ఫోన్‌లో మాట్లాడించారని ఆదివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్పినట్టుగా సమాచారం. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు కూడా చేయని విధంగా అధినాయకత్వమే నిందలు వేస్తే జీర్ణించుకోలేకపోయానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. తనను దోషిలా ప్రశ్నలడిగిందని, పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో నాయకులు అసంతృప్తిగా ఉన్నారని తాను చెప్పానని అన్నారు. అయితే ప్రజలు ఆనందంగా ఉన్నారని ఐప్యాక్ టీమ్ సభ్యులు చెప్పారని, ఆ నిర్లక్ష్యంతోనే బిల్లుల చెల్లింపు ఆలస్యం చేసినట్టుగా స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు.

More Telugu News