Zuckerberg: జుకర్ బర్గ్ ప్రాణాలకు ముప్పు.. ఫైనాన్షియల్ రిపోర్టులో ‘మెటా’ ఆందోళన

  • మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో గాయాలపాలయ్యే ప్రమాదం
  • కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని ఆందోళన
  • ఎలాన్ మస్క్ తో కేజ్ ఫైట్ కోసం జుకర్ బర్గ్ ప్రత్యేక శిక్షణ
Risk of severe injury or worse for Zuckerberg says Meta Report

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందంటూ మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్టులో ఈమేరకు ఆందోళన వెలిబుచ్చింది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో జుకర్ బర్గ్ కు ప్రావీణ్యం ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్స్ ‘జు జిట్సు’ లో ఆయన బ్లూ బెల్ట్ సాధించారు. జుకర్ బర్గ్ తో సహా మెటా కంపెనీలోని ముఖ్యమైన సిబ్బంది పోరాట క్రీడల్లో పాల్గొంటున్నారని మెటా తన రిపోర్టులో పేర్కొంది. ఈ క్రీడల్లో ప్రమాదం జరిగి వారు గాయపడ్డా, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా కంపెనీ నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది.

గతేడాది నవంబర్ లో మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో పాల్గొన్న జుకర్ బర్గ్ గాయపడ్డ విషయాన్ని కంపెనీ తన రిపోర్టులో గుర్తుచేసింది. జుకర్ బర్గ్ మోకాలికి గాయమైందని, ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. మరోవైపు, తనతో కేజ్ ఫైట్ కు రమ్మంటూ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ విసిరిన ఛాలెంజ్ ను జుకర్ బర్గ్ స్వీకరించిన విషయం తెలిసిందే. దీనికోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వీరిద్దరి ఫైట్ కోసం ఎదురుచూశారు. అయితే, మస్క్ ఈ ఛాలెంజ్ ను తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపిస్తూ జుకర్ బర్గ్ ఈ ఫైటింగ్ ఆలోచనను వదిలేశారు.

ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానం..
ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్ బర్గ్ నాలుగో స్థానానికి ఎగబాకారు. బిల్ గేట్స్ ను ఆయన అధిగమించారు. శుక్రవారం కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల అనంతరం మెటా షేర్లు 20 శాతం పెరిగి జుకర్ బర్గ్ సంపద 170.5 బిలియన్ డాలర్లకు చేరింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ 165 బిలియన్‌ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో ఉన్నారు.

More Telugu News