Bharat Ratna: అద్వానీకి భారతరత్న.. ఎంతో ఆనందంగా ఉందన్న మోదీ!

  • అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించిన భారత ప్రభుత్వం
  • అద్వానీతో మాట్లాడి, అభినందనలు తెలియజేశానన్న మోదీ
  • దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవన్న ప్రధాని
LK Advani honored with Bharat Ratna announces PM Narendra Modi

బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు అద్వానీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. "ఎల్కే అద్వానీ గారికి భారతరత్న పురస్కారం ఇవ్వబడుతోందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో నేను మాట్లాడాను. ఈ పురస్కారాన్ని పొందబోతున్నందుకు అభినందనలు తెలియజేశాను. సమకాలీన అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరు. మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవి. 

అట్టడుగు స్థాయిలో పని చేయడం దగ్గర నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేయడం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైనది. దేశ హోంమంత్రిగా, సమాచారశాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. ఆయన పార్లమెంటరీ అనుభవం ఎంతో ఆదర్శప్రాయమైనది, ఎంతో ఆలోచనప్రాయమైనది. 

సుదీర్ఘమైన దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన అనుసరించిన పారదర్శకత, సమగ్రత రాజనీతిలో ఆదర్శప్రాయమైన ప్రమాణాలను నెలకొల్పాయి. జాతీయ ఐక్యత, సాంస్కృతికతను పెంపొందించే దిశగా అసమానమైన కృషి చేశారు. ఆయనకు భారతరత్న రావడం నన్ను భావోద్వేగానికి గురి చేస్తోంది. ఆయనతో సంభాషించడానికి, ఆయన నుంచి నేర్చుకోవడానికి నాకు లెక్కలేనన్ని అవకాశాలు రావడాన్ని నేను ఎప్పుడూ అదృష్టంగా భావిస్తాను" అని మోదీ ట్వీట్ చేశారు. అద్వానీతో దిగిన ఫొటోలను కూడా మోదీ షేర్ చేశారు. అద్వానీకి భారతరత్న పురస్కారం దక్కడంపై పార్టీలకు అతీతంగా హర్షం వ్యక్తమవుతోంది.

More Telugu News