Kodandaram: కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారు: మంత్రి సీతక్క

  • కోదండరాం తెలంగాణ కోసం పోరాడారన్న సీతక్క
  • ఆదిలాబాద్ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని వెల్లడి 
  • ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్న మంత్రి
Minister Seethakka blames brs leaders for attack on kodandaram

తెలంగాణ జన సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తెలంగాణ కోసం పోరాడిన కోదండరాంకు పదవి ఇస్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబడిందని... ఈ జిల్లాకు గత ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. రేపు ఇంద్రవెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. తాను ఆదివాసీ బిడ్డనని... ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాకు తనను ఇంఛార్జ్ మంత్రిగా వేయడం తన అదృష్టమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి తన లక్ష్యమన్నారు.

ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం

ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను, 1981లో అక్కడ పోలీసుల కాల్పుల్లో గాయపడినవారిని ఆదుకుంటామని సీతక్క తెలిపారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, ఆర్థిక సహాయం అందించడం సహా అన్ని రకాల సహకారాలు అందిస్తామని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశ పెడతామన్నారు. అంతర్గత ప్రాంతాలకు కొత్త రోడ్లు వేయడం, సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి దృష్టి సారిస్తున్నారన్నారు.

రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని, ఇప్పటికే ఉన్న వాటికి మరమ్మతులు చేస్తామని వెల్లడించారు. ఇంద్రవెల్లి అమరవీరుల వివరాలు, 1981 ఏప్రిల్ 20న జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడిన వారి వివరాలు, వారి కుటుంబ వివరాలను సేకరిస్తామని తెలిపారు. ఆదివాసీలు, వారి దేవుళ్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవముందని... ఆదివాసీల దేవుళ్ళ ఆశీస్సులతో తాను సీఎంను అయ్యానని రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతారన్నారు.

More Telugu News