Indian Origin couple: భారత సంతతి జంటకు 33 ఏళ్ల జైలు

  • డ్రగ్స్ ఎగుమతి చేస్తూ దొరికిపోయిన భార్యాభర్తలు
  • గుజరాత్ లో ఈ జంటపై డబుల్ మర్డర్ కేసు
  • లండన్ లోని ఈ జంట ఇంట్లో కళ్లు చెదిరే ఆస్తులు
Indian origin couple jailed in UK for 33 years

డ్రగ్స్ దందాలో అరెస్టయిన భారత సంతతి భార్యాభర్తలు ఆరతీ ధీర్, కవల్ జిత్ సింహ్ రాయ్ జాదాలకు లండన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దోషులుగా తేల్చి తాజాగా శిక్ష ఖరారు చేసింది. ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఈ జంటను పోలీసులు 2021లో అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు హాన్ వెల్ లోని వారి నివాసంలో పోలీసులు సోదా చేయగా కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. దాదాపు రూ. 31 కోట్ల విలువైన యూరోలు నగదు రూపంలో దొరకగా.. రూ.8 కోట్ల విలువైన ఇల్లు, ఖరీదైన లాండ్ రోవర్ కారు, మొత్తం 22 బ్యాంకుల్లో డిపాజిట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

గతంలో హీత్రూ విమానాశ్రయంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంతో ఆరతీ, రాయ్ జాదాలు లండన్ లో సొంతంగా సరుకు రవాణా కంపెనీ పెట్టుకున్నారు. తమకున్న అనుభవంతో చెకింగ్ అధికారులను బోల్తా కొట్టిస్తూ ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి చేశారు. 2014 నుంచి 2016 వరకు వీరి దందా నిర్విఘ్నంగా జరిగిందని, మెటల్ బాక్స్ లలో డ్రగ్స్ పెట్టి ఆస్ట్రేలియా పంపించే వారని అధికారులు తెలిపారు. ఇలా టన్నుల కొద్దీ డ్రగ్స్ ను పంపించినట్లు బయటపడిందన్నారు. ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు ఈ దందాను గుర్తించి అడ్డుకోవడంతో పాటు యునైటెడ్ కింగ్ డమ్ జాతీయ నేర విచారణ సంస్థ (ఎన్ సీఏ) ను అప్రమత్తం చేశారు. దీంతో ఎన్ సీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టగా ఆరతీ, రాయ్ జాదాల డ్రగ్స్ దందా బయటపడింది.

ఆరతీ, రాయ్ జాదాలపై మన దేశంలోనూ ఓ కేసు పెండింగ్ లో ఉంది. గుజరాత్ లో జరిగిన డబుల్ మర్డర్ వెనక ఈ జంట హస్తం ఉందని పోలీసులు కేసు పెట్టారు. గుజరాత్ కు చెందిన గోపాల్ సెజని అనే పదకొండేళ్ల బాలుడిని ఈ జంట దత్తతకు తీసుకుంది. ఆపై పెద్ద మొత్తంలో గోపాల్ కు ఇన్సూరెన్స్ చేయించింది. ఆ సొమ్ము కోసం 2017లో కిరాయి హంతకులను పురమాయించి బాలుడిని కిడ్నాప్ చేసి చంపించింది. గోపాల్ ను కాపాడేందుకు ప్రయత్నించిన అతడి బావ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆరతీ, రాయ్ జాదాలపై గుజరాత్ పోలీసులు డబుల్ మర్డర్ కేసు నమోదు చేశారు. కేసు విచారణ కోసం ఆరతీ, రాయ్ జాదాలను అప్పగించాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని యూకే తోసిపుచ్చింది.

More Telugu News