Kishan Reddy: చిరంజీవికి పద్మ విభూషణ్ ఇచ్చింది బీజేపీలో చేరతారని కాదు: కిషన్ రెడ్డి

  • ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్
  • బీజేపీలో చేరతారనే ఆయనకు అవార్డు ప్రకటించారంటూ ప్రచారం
  • బీజేపీ పద్మ అవార్డుదారులను ఎవరినీ పార్టీలోకి ఆహ్వానించలేదన్న కిషన్ రెడ్డి
  • ఎవరైనా పార్టీలోకి వస్తామంటే స్వాగతిస్తామని వెల్లడి 
  • జనసేనతో పొత్తుపై సమాధానం దాటవేసిన వైనం
Kishan Reddy talks about Padma Vibhushan for Chiranjeevi

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పై స్పందించారు. చిరంజీవికి పద్మ విభూషణ్ ఇచ్చింది ఆయన బీజేపీలో చేరతారని కాదని స్పష్టం చేశారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక మందికి పద్మ అవార్డులు ఇచ్చిందని, వారందరూ బీజేపీలోకి వస్తారని అవార్డులు ఇవ్వలేదంటూ కిషన్ రెడ్డి ఆ తరహా ప్రచారాన్ని ఖండించారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా పద్మ అవార్డుదారులను పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపారు. 

గుర్తింపునకు నోచుకోని కవులు, కళాకారులను గౌరవించాలన్న ఉద్దేశంతో ఇటీవల కేంద్రం పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిందని, కొందరికి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించిందని, వారందరూ బీజేపీలోకి వస్తారని అవార్డులు ఇచ్చామన్న వాదన అర్థరహితం అన్నారు. ఒకవేళ వాళ్లలో ఎవరైనా బీజేపీలోకి వస్తామంటే వద్దనబోమని, ఇది ప్రజాస్వామ్యం అని, ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చని కిషన్ రెడ్డి వివరించారు. 

ఇక, జనసేనతో పొత్తు గురించి గతంలోనే చెప్పామని క్లుప్తంగా సమాధానమిచ్చారు. అప్పటికీ ఓ విలేకరి జనసేనతో పొత్తుపై రెట్టించి అడగడంతో, ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? అంటూ కిషన్ రెడ్డి నవ్వుతూ అడిగారు. 

అంతకుముందు ఆయన పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఫిబ్రవరి 2న రాష్ట్ర స్థాయి బీజేపీ సమావేశం జరగనుందని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణ, ప్రణాళికపై చర్చిస్తామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం జాతీయ స్థాయి ప్రక్రియ చేపడతామని వివరించారు. రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి ఆశావహుల పేర్లను పంపిస్తుందని, కేంద్ర నాయకత్వం పరిశీలన జరిపి అభ్యర్థులను నిర్ణయిస్తుందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తాను ఎక్కడినుంచి పోటీ చేస్తాననేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News