Google: 12 వేల మంది ఉద్యోగుల లేఆఫ్స్ కోసం గూగుల్ కు 17500 కోట్ల వ్యయం

  • ఈ ఏడాది చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన గూగుల్
  • ఆదాయం పెరుగుదలలో రెండంకెల వృద్ధి నమోదు
  • ఏఐ వినియోగంతో ఆదాయం పెరిగిందన్న సంస్థ
  • 2022తో పోలిస్తే గతేడాది గూగుల్ ఆదాయంలో 9 శాతం వృద్ధి నమోదు
Google spent 17500 crore to lay off 12000 employees

గతేడాది గూగుల్ మునుపెన్నడూ చూడని విధంగా లేఆఫ్స్ చేపట్టింది. వివిధ శాఖల్లోని దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ కార్యకలాపాల సరళీకరణ చేపట్టిన ఈ తొలగింపుల కోసం గూగుల్ భారీగా ఖర్చుపెట్టినట్టు తాజాగా వెల్లడైంది. ఉద్యోగులకు లేఆఫ్స్ పరిహారం చెల్లింపులు ఇతర ఖర్చుల కోసం మొత్తం రూ.17,500 కోట్లు ఖర్చు చేసినట్టు గూగుల్ మాతృ సంస్థ మంగళవారం విడుదల చేసిన తన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలగింపుల కోసం మరో 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. 

తొలగింపుల తరువాత గూగుల్ నాలుగో త్రైమాసికంలో అంచనాలకు మించిన పనితీరు కనబరిచింది. గతేడాది గూగుల్ 307 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. అంతకుమునుపు ఏడాదితో పోలిస్తే ఆదాయంలో 9 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఆన్‌లైన్ సెర్చింగ్, అడ్వర్‌టైజింగ్‌లో ఆధిపత్యం, యూట్యూబ్, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల నుంచి రాబడి పెరగడంతో చివరి త్రైమాసికంలో ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైంది. వరుసగా రెండు దశాబ్దాల పాటు వృద్ధిపథంలో దూసుకుపోయిన గూగుల్ ప్రకటనల ఆదాయం ఆ మధ్య కాస్తంత నెమ్మదించినా తాజాగా మళ్లీ కోలుకుంది. యాడ్‌లపై ఆదాయం పెరిగినప్పటికీ యూట్యూబ్, క్లౌడ్ కంప్యూటింగ్ శాఖల నుంచి గూగుల్ అధిక రాబడి సాధించింది. సంస్థ కార్యకలాపాల్లో ఏఐ వినియోగం పెంపు రాబడులను పెంచిందని కంపెనీ ప్రకటించింది. 

సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 6 వేల మందిని తొలగించబోతున్నట్టు గూగుల్ గతేడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. గూగుల్ చరిత్రలో భారీ స్థాయిలో చేపట్టిన లేఆఫ్స్ ఇవేనని అప్పట్లో సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్తు దృష్యా ఈ తొలగింపులు తప్పలేదని ఆయన పేర్కొన్నారు. రాబోయే నెలల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని గూగుల్ సీఈఓ ఉద్యోగులను హెచ్చరించారు. సంస్థ కార్యకలాపాల సరళీకరణ కోసం ఈ తొలగింపులు చేపడుతున్నట్టు వివరించారు. అయితే, ఈసారి తొలగింపులు గతేడాది స్థాయిలో ఉండవని చెప్పారు. కొన్ని విభాగాల్లోనే ఉద్యోగులను తొలగిస్తామని వివరించారు.

More Telugu News