Harish Rao: ఇదేనా ప్రజాపాలన?: కోమటిరెడ్డి వీడియోతో హరీశ్ రావు ప్రశ్న... వీడియో ఇదిగో

  • 'ప్రజాపాలన'లో సాటి ప్రజాప్రతినిధులను మంత్రులు అవమానపరుస్తున్నారన్న హరీశ్ రావు
  • సందీప్ రెడ్డిపై అకారణంగా దుర్భాషలాడారని కోమటిరెడ్డిపై ఆగ్రహం
  • ప్రజాస్వామ్యవాదులంతా కోమటిరెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపు
BRS MLA Harish Rao questions congress government

కాంగ్రెస్ 'ప్రజాపాలన'లో సాటి ప్రజాప్రతినిధులను మంత్రులు అవమానపరుస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మొన్న రైతుబంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నేడు యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారిక కార్యక్రమంలో అకారణంగా దుర్భాషలాడి కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు.

కోమటిరెడ్డి తాను మాట్లాడింది చాలదన్నట్లుగా పోలీసులకు హుకుం జారీ చేసి సందీప్ రెడ్డిని బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు. కోమటిరెడ్డి తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా కోమటిరెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా... జిల్లా పరిషత్ ఛైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది?

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గూడూరు గ్రామంలో గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇదే సభలో జెడ్పీ చైర్మన్‌ సందీప్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సందీప్ రెడ్డి మాట్లాడుతూ... నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలనడం మంచి పద్ధతి కాదన్నారు. 

ఈ సమయంలో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని మహానాయకుడు మాధవరెడ్డి కడుపులో పుట్టిన సందీప్ రెడ్డి ఓ బచ్చా... కనీసం వార్డు మెంబర్‌గా గెలవలేని వ్యక్తి అంటూ విమర్శలు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు స్టేజ్ పైకి వచ్చారు. సందీప్ రెడ్డిని తోసివేసే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనను పక్కకు తీసుకువెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News