Thailand: అపార్ట్‌మెంట్ నుంచి దూకిన సాహసికుడు.. పారాచూట్ తెరుచుకోక దుర్మరణం

  • థాయ్‌లాండ్‌లోని పట్టాయ ప్రాంతంలో శనివారం ఘటన, 
  • భారీ అపార్ట్‌మెంట్‌‌ 29వ అంతస్తు నుంచి దూకిన బ్రిటీష్ స్కైడైవర్
  • పారాచూట్ వైఫల్యంతో నేలను బలంగా ఢీకొని దుర్మరణం
British Skydiver Falls To Death From 29 Storey Building As Parachute Fails To Open

అపార్ట్‌మెంట్‌లోని 29వ అంతస్తు నుంచి దూకి బేస్ జంపింగ్ చేయాలనుకున్న ఓ బ్రిటీష్ స్కైడైవర్ దుర్మరణం చెందాడు. పారాచూట్ సమయానికి తెరుచుకోక పోవడంతో నేలపై పడి మృతిచెందాడు. థాయ్‌లాండ్‌లో పట్టాయ ప్రాంతంలో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. 

కేంబ్రిడ్జిషైర్‌లోని హంన్టింగ్టన్‌కు చెందిన నేథన్ ఓడిన్సన్ (33) స్కైడైవర్. అతడికి ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. తన సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. స్కైడైవింగ్ చేయాలనుకునే వారికి సాయపడుతూ ఉంటాడు. 
 
అపార్ట్‌మెంట్ భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఘటన జరిగిన రోజున నేథన్ ఎవరి కంటా పడకుండా అపార్ట్‌మెంట్‌‌లోని 29వ అంతస్తుకు వెళ్లాడు. అపార్ట్‌మెంట్ బయటనిలబడ్డ అతడి గర్ల్‌ఫ్రెండ్ నేథన్ సాహసాన్ని రికార్డు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో నేథన్ కిందకు దూకగా పారాచూట్ మాత్రం తెరుచుకోలేదు. దీంతో, అతడు సమీపంలోని చెట్లల్లోంచి పడుతూ నేలను బలంగా ఢీకొట్టి దుర్మరణం చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది అతడు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. 

నేథన్ గతంలోనూ ఈ అపార్ట్‌మెంట్‌పై పలుమార్లు ఇదే దుస్సాహసం చేశాడని అక్కడి సెక్యూరిటీ గార్డు తెలిపాడు. అతడి చర్యల కారణంగా అపార్ట్‌మెంట్ సమీపంలోని పాదచారులకు ప్రమాదం ఉండేదని చెప్పాడు. ఇక పారాచూట్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనపై ఫారెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. నేథన్ మృతి గురించి పోలీసులు బాంకాక్‌లోని బ్రిటన్ ఎంబసీకి సమాచారం అందించారు. నేథన్ కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

ఎత్తయిన భవనాలు, ఆకాశ హర్మ్యాల నుంచి పారాచూట్ సాయంతో దూకడాన్ని బేస్ జంపింగ్ అంటారు. ఇందులో పారాచూట్ తెరుచుకునేందుకు తక్కువ సమయం ఉండటంతో ఈ సాహసం అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. బేస్ జంపింగ్‌లో సాహసికుడు మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

More Telugu News