Nara Lokesh: ఆయన కోసం టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి: నారా లోకేశ్

Nara Lokesh says TDP doors always open for Galla Jaydev
  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన గల్లా జయదేవ్
  • గుంటూరులో కృతజ్ఞతాభివందనం సభ
  • హాజరైన నారా లోకేశ్
  • గల్లా జయదేవ్ వెళ్లిపోతుండడం చాలా బాధాకరమని వెల్లడి
  • ఆయన విరామం తాత్కాలికమేనని స్పష్టీకరణ
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు నేడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, గల్లా జయదేవ్ కు కృతజ్ఞతాభివందనం పేరిట గుంటూరులో సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. 

గల్లా జయదేవ్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారని, ఆయనకు టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని లోకేశ్ స్పష్టం చేశారు. వ్యక్తిత్వానికి మారు పేరు జయదేవ్ అని కొనియాడారు. 

"సిద్ధాంతాల కోసం నిలబడే వ్యక్తి నేను... రాజకీయాల నుంచి తప్పుకుంటానే గానీ పార్టీ మారేది లేదు అని జయదేవ్ కరాఖండీగా చెప్పారు. ఇవాళ నిజంగా ఎంతో బాధపడుతున్నా. ఇంత దగ్గరయ్యామే... ఎందుకు రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నాడు? విచారం కలిగింది. డెఫినెట్ గా జయదేవ్ ను మేం రాజకీయంగా మిస్ అవుతాం. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేదానిపై జయదేవ్ మనకు అన్నివేళలా అందుబాటులో ఉంటారు" అంటూ లోకేశ్ ప్రసంగించారు. 

ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ మాట్లాడుతూ, తనకు రాజకీయ అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల గొంతుక వినిపించడానికి రాజకీయాల్లోకి వచ్చానని, కానీ రాజకీయ పరిమితుల వల్ల అటు కేంద్రంతో పోరాడలేకపోతున్నానని, ఇటు వ్యాపార పరిమితుల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపైనా మాటల దాడి చేయలేకపోతున్నానని గల్లా జయదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఇవేవీ చేయకుండా, వాళ్లు వీళ్లు వాదించుకుంటుంటే చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. తనను జైల్లో వేసినా ఫర్వాలేదు కానీ, నోరు మూసుకుని కూర్చోమంటే కూర్చోలేనని స్పష్టం చేశారు. వివాదాలు లేకుండా రాజకీయాలు చేయడం చాలా కష్టమైన పని అని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. 

పార్ట్ టైమ్ గా వ్యాపారం చేసుకోవచ్చేమో కానీ, పార్ట్ టైమ్ గా రాజకీయాలు చేయలేమన్న విషయం అర్థమైందని అన్నారు. ఎలాంటి పోరాటాలు చేయలేనప్పుడు ప్రజల ముందుకు వచ్చి ఓటు అడగలేనని, పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలనుకున్నప్పుడే మళ్లీ ప్రజల ముందుకు వస్తానని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.
Nara Lokesh
Galla Jayadev
TDP
Politics
Andhra Pradesh

More Telugu News