Contractor: బాలరాముడి విగ్రహం శిల కోసం కాంట్రాక్టర్ భార్య తాళి తాకట్టు

Contractor who extracted stone for Ram idol in Ayodhya fined Rs 80000 by Government
  • కృష్ణ శిల వెలికితీసి కష్టాలపాలైనట్లు కాంట్రాక్టర్ వెల్లడి
  • ప్రభుత్వ అనుమతిలేదని అధికారులు భారీ ఫైన్ వేశారని వివరణ
  • ఇప్పుడు విగ్రహంగా మారి కోట్లాది భక్తుల పూజలు అందుకుంటోందన్న కాంట్రాక్టర్
బాల రాముడి విగ్రహం కోసం ఉపయోగించిన కృష్ణ శిలను కర్ణాటకలోని ఓ రైతు పొలంలో నుంచి వెలికితీసిన విషయం తెలిసిందే. అయితే, ఈ శిలను వెలికితీయడం వల్ల తాను కష్టాలపాలయ్యానని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. వెలికితీతకు సంబంధించి కొంత లాభం వచ్చినా.. అధికారులు తనకు భారీ మొత్తంలో ఫైన్ వేశారని తెలిపాడు. మైసూరు జిల్లా హెచ్ డీ కోట తాలూకా బుజ్జేగౌడనపురలోని పొలంలో ఈ శిలను గుర్తించారు. దీనిని వెలికి తీసేందుకు శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఆ పొలం యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూలీలను పెట్టి శిలను బయటకు తీయించాడు.

ఈ డీల్ లో ఖర్చులన్నీ పోనూ తనకు రూ.25 వేల వరకు గిట్టుబాటు అయిందని శ్రీనివాస్ చెప్పాడు. అయితే, శిలను బయటకు తీసేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని, ఇందుకు రూ.80 వేలు జరిమానా కట్టాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర, గనులు భూగర్భ శాఖ అధికారులు జారీ చేసిన ఈ నోటీసులను చూసి ఆందోళనకు గురైనట్లు శ్రీనివాస్ చెప్పాడు. వెంటనే అధికారులను వెళ్లి కలవగా.. జరిమానా వెంటనే కట్టకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. దీంతో తన భార్య తాళిని తాకట్టు పెట్టి, సొమ్ము తీసుకెళ్లి జరిమానా చెల్లించినట్లు శ్రీనివాస్ వివరించాడు.

అప్పటికి తనకు వివాహం జరిగి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అయిందని శ్రీనివాస్ చెప్పాడు. భవిష్యత్తులో ఆ శిలను రాముడి విగ్రహం కోసం ఉపయోగిస్తారని అప్పట్లో తమకు తెలియదన్నాడు. వెలికి తీసిన ఆ శిల అరుణ్ యోగిరాజ్ చేతిలో పడడం, బాలక్ రామ్ విగ్రహంగా మారి అయోధ్య రామ మందిరానికి చేరడం, కోట్లాది మంది భక్తుల పూజలు అందుకోవడం.. అంతా మాయలా ఉందని శ్రీనివాస్ చెప్పాడు.
Contractor
Ram Lalla
Stone Excavation
Karnataka
Ayodha Ram Lalla Idol

More Telugu News