Ganta Srinivasa Rao: ఎన్నికల నోటిఫికేషన్ కు నెల రోజుల ముందు జగన్ కొత్త మోసానికి తెర తీశారు: గంటా శ్రీనివాసరావు

  • డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ జగన్ హడావుడి చేస్తున్నారన్న గంటా
  • ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్న
  • చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చేవారని ఎద్దేవా
Ganta Srinivas Rao comments on Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక నెల రోజుల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ రాష్ట్రంలో మరో కొత్త మోసానికి తెర తీశారని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా ఉపాధ్యాయుల భర్తీని పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. 

"ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? ఎప్పుడు పోస్టులు భర్తీ చేస్తారు? ఎన్నికల సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయగలరా? ఎందుకు ఈ వట్టి వాగ్దానాలు? ఇలా నిరుద్యోగులను ఎన్ని రోజులని మభ్యపెడతారు?" అని ప్రశ్నించారు. ఆ రోజు మీరు చెప్పిన ఉద్యోగాల ఖాళీలు ఆకాశమంత... ఈరోజు ఇస్తానంటుంది గోరంత అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 25 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారని...  తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అన్నారని... ఆ తర్వాత ఏడాదికి ఒక డీఎస్సీ అన్నారని... గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ అన్నారని గుర్తు చేశారు. 

పాఠశాల విద్యాశాఖలో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశాల్లో మీరే ప్రకటించిన సంగతి మర్చిపోయారా? అని గంటా ప్రశ్నించారు. ఇప్పుడేమో మినీ డీఎస్సీ అంటూ 6 నుంచి 7 వేల పోస్టులతో తూతూమంత్రంగా మమ అనిపించాలని చూస్తున్నారని విమర్శించారు. మరో నెల రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న సమయంలో.. హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం, యువతను తప్పుదోవ పట్టించడం ఇలా ప్రతిదీ మీకు అలవాటుగా మారిందని అన్నారు. 

మీకు నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఒక 6 నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చేవారని గంటా అన్నారు. 2014, 2019లో రెండు మెగా DSCలు ప్రకటించి 16,790 మంది నిరుద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని అన్నారు. ఒక ప్రణాళిక లేకుండా ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ ఇచ్చి నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్య పడాల్సిన అవసరం లేదని... రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, మీకు ఉద్యోగాలను ఇచ్చే బాధ్యతను చంద్రబాబు తీసుకుంటారని చెప్పారు.

More Telugu News