Arvind Kejriwal: మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు.. బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు

  • 7 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనాలని చూశారని కేజ్రీవాల్ ఆరోపణ
  • పార్టీ మారితే రూ.25 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందన్న ఢిల్లీ సీఎం
  • లిక్కర్ స్కామ్‌ కేసులో సీఎం అరెస్ట్ అవుతారని బెదిరించాని ఆరోపణ
Arvind Kejriwal says that BJP tried to poach 7 AAP MLAs

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. 7 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారితే రూ.25 కోట్లు ఇస్తామంటూ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరిపిందని, ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ ఎమ్మెల్యేలని బెదిరించారని అన్నారు. ఆప్‌ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని అన్నారు. 

‘‘ఇతర ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా మాతో రావొచ్చు. 25 కోట్లు ఇస్తాం ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయండి’’ అంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు అందరూ దానిని తిరస్కరించారని పేర్కొన్నారు.

ఢిల్లీ కేసులో దర్యాప్తు చేయడం లేదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇలాంటి కుట్రలు చాలానే జరిగాయని, కానీ అవేమీ సాధ్యపడలేదని అన్నారు. దేవుడు, ప్రజలు తమకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చారని, ఆప్ ఎమ్మెల్యేలంతా నిక్కచ్చిగా ఉన్నారని, ఈసారి కూడా కుయుక్తులు విఫలమవుతాయని కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. 

‘‘ఢిల్లీ ప్రజల కోసం ప్రభుత్వం ఎంత కృషి చేసిందో ఈ జనాలకు తెలుసు. వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము చాలా సాధించాం. ఢిల్లీ ప్రజలు ‘ఆప్’ని అమితంగా ప్రేమిస్తారు. ఎన్నికల్లో ఆప్‌ని ఓడించడం వారి వల్ల కాదు. అందుకే నకిలీ మద్యం కుంభకోణం సాకుతో అరెస్టు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు’’ అని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.   

More Telugu News