Nitrogen Gas Execution: అమెరికాలో కొత్త పద్ధతిలో మరణ శిక్ష.. ఇదే అత్యంత మెరుగైన విధానమట!

  • అలబామా రాష్ట్రంలో కెన్నెత్ యూజీన్ స్మిత్‌కు నైట్రోజన్ వాయువుతో మరణశిక్ష
  • నిందితుడికి నైట్రోజన్ వాయువును మాత్రమే పంపే మాస్క్‌ తొడిగి శిక్ష అమలు
  • ప్రాణవాయువు అందక అల్లాడి, చివరకు అచేతనంగా మారిపోయిన నిందితుడు 
  • శిక్ష అమలుకు 22 నిమిషాల సమయం
US Carries Out 1st Nitrogen Gas Execution Amid Outcry

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో తొలిసారిగా కొత్త పద్ధతిలో మరణ శిక్ష అమలు చేశారు. ఇప్పటివరకూ వినియోగిస్తున్న ప్రాణాంతక ఇంజెక్షన్లకు బదులు నైట్రోజన్ వాయువు ప్రయోగంతో కెన్నెత్ యూజీన్ స్మిత్‌కు హోల్‌మన్ కారాగారంలో మరణశిక్ష అమలు చేశారు. 

శిక్ష అమలు కోసం నిందితుడికి నైట్రోజన్ వాయువు మాత్రమే విడుదల చేసే ఓ మాస్క్‌ను తొడిగారు. ఈ క్రమంలో నిందితుడు ప్రాణవాయువు అందక తొలి రెండు నిమిషాలు అల్లాడాడు. ఆ తరువాత కొన్ని నిమిషాలపాటు బలంగా శ్వాస తీసుకున్నాక చివరకు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ శిక్ష అమలును వీక్షించేందుకు నిందితుడి భార్య, బంధువులతో పాటూ పలువురు జర్నలిస్టులను కూడా జైలు అధికారులు అనుమతించారు. నిందితుడు తన భార్యను చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పాడు. ‘‘నేడు అలబామా రాష్ట్రం మానవత్వం తిరోగమించేలా చేసింది’’ అని అతడు చివరిసారిగా అన్నట్టు జర్నలిస్టులు తెలిపారు. మొత్తం 22 నిమిషాల్లో శిక్ష పూర్తయినట్టు తెలిసింది. అయితే, అలబామాతో పాటూ ఓక్లహోమా, మిసిసిప్పీ రాష్ట్రాలు కూడా నైట్రోజన్ వాయువుతో మరణశిక్షకు ఆమోదం తెలిపాయి. 

1999లో చివరిసారిగా అమెరికాలో ప్రాణాంతక వాయువుతో మరణశిక్ష విధించారు. అప్పట్లో హైడ్రోజన్ సైనైడ్ వాయువు ప్రయోగంతో ఓ హత్యకేసు దోషికి మరణ శిక్ష వేశారు. 

ఇదిలా ఉంటే.. శాస్త్రయపద్ధతిలో పూర్తిగా పరీక్షించని నైట్రోజన్ వాయువు విధానంపై అమెరికాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా మరణశిక్షల అమలు మానవులపై ప్రయోగాలేనంటూ విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ శిక్షను అడ్డుకునేందుకు చివరి నిమిషంలో దాఖలైన పిటిషన్ల విషయంలో జోక్యం చేసుకోబోమని కోర్టు పేర్కొంది. తమ నిర్ణయానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. 

నిందితుడు స్మిత్ తరపు లాయర్లు శిక్షపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ముఖానికి మాస్క్ సరిగ్గా అమరకపోతే ఆక్సిజన్ లోపలికి ప్రవేశించి మరణం సంభవించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అతడి మెదడు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే, అలబామా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. మానవత్వం కోణంలో చూస్తే ఈ తరహా శిక్షే అన్నిటికంటే మెరుగైనదని చెప్పుకొచ్చింది.

More Telugu News