tricolor: గణతంత్ర దినోత్సవం రోజున ‘జెండా ఆవిష్కరణ’.. స్వాతంత్ర్య దినోత్సవాన ‘జెండా ఎగురవేత’.. వ్యత్యాసం ఏంటి? ఎందుకు?

Why is the unfurled tricolor hoisted on Republic Day and what is difference with Independence Day
  • స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్తంభం దిగువ నుంచి జెండాను పైకి లాగి ఎగరవేత
  • గణతంత్ర దినోత్సవం రోజున స్తంభం ఎగువ భాగానే జెండా ఆవిష్కరణ
  • నిర్వహణలో వ్యత్యాసం ఉన్నప్పటికీ రెండు దినోత్సవాలకూ విశేష ప్రాముఖ్యత
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జరుగుతున్నవి 75వ రిపబ్లిక్ వేడుకలు కావడం ప్రత్యేక విశేషంగా ఉంది. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవానికి విభిన్నంగా గణతంత్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరిస్తారని తెలుసా? 'జెండా ఎగురవేయడం', 'జెండా ఆవిష్కరణ' ఈ రెండు పదాలను ఒకదానికి బదులు మరొక దానిని ఉపయోగిస్తుంటారు. అయితే జెండాను ప్రదర్శించడంలో విభిన్న పద్ధతులు, విశేష అర్థాలను ఈ పదాలు సూచిస్తాయి. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఈ జెండా ప్రదర్శనలో వైవిధ్యాన్ని గుర్తుచేసుకుందాం. 

స్తంభానికి జెండాను ఏ విధంగా ఉంచుతారనేది గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ప్రదర్శనకు సంబంధించి ప్రధాన వ్యత్యాసంగా ఉంది. మడతపెట్టి ఉన్న లేదా చుట్టి ఉన్న త్రివర్ణపతాకాన్ని స్తంభం పైభాగంలోనే తాడు సహాయంతో విప్పడాన్ని ‘జెండా ఆవిష్కరణ’ అంటారు. అయితే జెండాను తాడు ద్వారా పైకి లాగి ప్రదర్శించడాన్ని ‘జెండా ఎగురవేయడం’ అని పిలుస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున జెండాను ఆవిష్కరిస్తారు, స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండాను ఎగురవేస్తారు.

మరి ఈ వ్యత్యాసం ఎందుకు?

1950లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురష్కరించుకొని గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాల పట్ల నిబద్ధత, దేశ పునరుద్ధరణకు సంకేతంగా జెండాను ఆవిష్కరించారు. బ్రిటిష్ వలస పాలన నుంచి దేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించడాన్ని ఈ రూపంలో సూచిస్తారు. ఈ పద్ధతిలోనే రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సహా దేశవ్యాప్తంగా నేడు(శుక్రవారం) జెండా ఆవిష్కరణ జరిగింది. 

ఇక స్వాతంత్ర్య దినోత్సవం భిన్నమైనది. దేశ ప్రధానమంత్రి స్తంభం దిగువ నుంచి జెండాను పైకి లాగి ఎగురవేస్తారు. జెండా ఎగురవేసేటప్పుడు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఒక సైనిక లేదా పౌర గౌరవ గార్డు జెండా తాడును స్తంభానికి కడతారు. ఇదంతా ఒక వేడుకగా జరుగుతుంది. నూతన దేశం అవతరణ, దేశభక్తి, వలస పాలన నుంచి విముక్తికి ప్రతీకగా ఈ విధంగా జెండాను ఎగురవేస్తారు. అయితే వేడుకలు నిర్వహించే విధానంలో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈ రెండు దినోత్సవాలు విశేషమైన, అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
tricolor
Republic Day
Republic Day2024
Independence Day
Tricolour Unfurled
Flag Hoist

More Telugu News