Venkaiah Naidu: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికవ్వడంపై స్పందించిన వెంకయ్య నాయుడు

  • చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పిన మాజీ ఉపరాష్ట్రపతి
  • శ్రేష్ఠ భారత్‌ నిర్మాణంలో తన వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తుచేసిందని వ్యాఖ్య
  • పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలిపిన వెంకయ్య నాయుడు
Venkaiah Naidu says Truly humbled on Padma Vibushan

తనకు పద్మవిభూషణ్ దక్కడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. "నాకు పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం నిజంగా చాలా గర్వంగా ఉంది. భారత ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న నాకు ఈ అవార్డు దక్కింది. ‘శ్రేష్ఠ భారత్‌’ నిర్మాణానికి భారత జాతి ప్రయత్నాలలో నా వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తుచేసింది. దేశంలోని రైతులు, మహిళలు, యువత, నాతోటి పౌరులందరికీ ఈ  పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం కృషి చేద్దాం. మాతృభూమి సేవకు పునరంకితం అవుదాం’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. 

ఇక తనతోపాటు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్య నాయుడు అభినందనలు  తెలిపారు. తన నటనా పటిమతో విశేష సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకొని చలనచిత్ర రంగానికి బహుముఖ సేవలు అందించారని ప్రశంసించారు. పద్మ విభూషణ్ పురస్కారం వరించిన మేటి నటీమణి, భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

మరోవైపు పద్మశ్రీ పురస్కారాలు వరించిన తెలంగాణకు చెందిన ఏవీ ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కే విఠలాచార్యలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మరో ట్వీట్ చేశారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. తాము ఎంచుకున్న రంగాలలో దేశానికి విశిష్ట సేవ, సహకారానికి గుర్తింపుగా ఈ అవార్డులు దక్కాయని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News