Ind Vs Eng Test Match: రేపటి భారత్ x ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

  • ఆరేళ్ల తరువాత ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
  • స్టేడియం పరిసరాల్లో 360 సీసీటీవీ కెమెరాలతో నిఘా
  • వాహనాల పార్కింగ్ కోసం స్థలాల రెడీ
  • ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు
Traffic restrictions in Uppal ahead of Ind vs Eng test match

గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ x ఇంగ్లండ్‌ తొలి టెస్టు జరగనుంది. దాదాపు ఆరేళ్ల తరువాత అక్కడ క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ప్రేక్షకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో, స్టేడియం పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ 360 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపు కూడా ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ప్రేక్షకుల సౌకర్యార్థం వాహనాల పార్కింగ్ స్థలాలు, సాధారణ ట్రాఫిక్‌తో పాటూ ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారులు, ఉప్పల్ మైదానం వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కార్లు, బైకులు, ఇతర వాహనాల కోసం 15 స్థలాలను రెడీ చేశారు. ఇక్కడకు సులభంగా చేరుకునేందుకు వీలుగా వీధుల్లో డైరెక్షనల్ బోర్డులు, లోకేషన్ మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. స్టేడియం వైపు వెళ్లే మార్గాల్లోనూ మాస్టర్ డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఉప్పల్ ఎక్స్ జంక్షన్ రోడ్డు, స్ట్రీట్ నెం.8 జంక్షన్, హబ్సిగూడ జంక్షన్, ఏక్ మినార్ మసీదు, తదితర ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో 250 మంది ట్రాఫిక్ పోలీసులను మోహరించారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

More Telugu News