Cricket in Hilly Terrain: కొండ లోయల్లో క్రికెట్ ఆడుతున్న యువతులు.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

  • కొండల్లో క్రికెట్ ఆడుతున్న యువతుల వీడియో నెట్టింట వైరల్
  • కొండ పైనున్న వీధిలో యువతుల బ్యాటింగ్, దిగువన ఉన్న రోడ్డులో మరికొందరి ఫీల్డింగ్
  • క్రికెట్‌ను భారత్ మరోస్థాయికి తీసుకెళ్లిందన్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra shares video of women playing cricket in hilly terrain

భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే ఈ క్రేజ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లిన కొందరు యువతుల వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. క్రికెట్‌పై ఆ యువతులకున్న క్రేజ్ చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. 

సాధారణంగా క్రికెట్ ఆడేందుకు మైదానం ఉండాలి. అది కుదరదనుకుంటే వీధుల్లో కాస్తంత సద్దుకుంటే ఆట‌ను ఎంజాయ్ చేయొచ్చు. కానీ కొండలు లోయలు, ఘాట్‌ రోడ్లపై కూడా క్రికెట్‌లో మునిగితేలాలంటే మాత్రం ఆటపై ఎనలేని అభిమానం ఉండాల్సిందే. అయితే, వీడియోలోని యువతులు తమకు సరిగ్గా ఇలాంటి వీరాభిమానమే ఉందని నిరూపించారు. ఆడేందుకు అనువైన స్థలం లేకపోయినా వీళ్లు వెనక్కు తగ్గల్లేదు. కొండపై ఉన్న ఓ సన్నని రోడ్డుపై కొందరు బ్యాటర్లు ఆడుతుంటే దాని దిగువన ఉన్న వీధుల్లో మరికొందరు ఫీల్డింగ్ చేశారు. 

ఈ వీడియో చూసి ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యపోయారు. క్రికెట్‌ను భారత్ మరోస్థాయికి తీసుకెళ్లిందని వ్యాఖ్యానించారు. యువతులు ‘అంచలంచెలుగా’ క్రికెట్ స్థాయి పెంచారని సరదా వ్యాఖ్య కూడా చేశారు. ఇక వీడియోకు సహజంగానే కుప్పలుతెప్పలుగా వ్యూస్ వస్తున్నాయి. రకరకాల కామెంట్లతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. క్రికెట్ మన రక్తంలోనే ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి క్రికెట్ తామెక్కడా చూడలేదంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఓ నెటిజన్ దాదాపుగా ఇలాంటి వీడియోనే షేర్ చేశారు. ఇందులో కొందరు యువకులు దట్టమైన పొంగమంచు కమ్ముకున్న సమయంలో బంతి కనబడకపోయినా లెక్కచేయకుండా క్రికెట్ ఆడటం చూడొచ్చు.

More Telugu News