Ram Lalla: నల్లరాతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ.. మిగతా రెండు విగ్రహాల మాటేమిటి?

  • రాజస్థానీ శిల్పి చేతిలో రూపుదిద్దుకున్న పాలరాతి విగ్రహం
  • విల్లంబులతో నిలుచున్న బాలుడి రూపంలో రాముడు
  • దశావతారాల ప్రతిరూపాలతో పాటు పాదాల చెంత లక్ష్మణుడు, సీత
Ram Lalla Idol That Lost Out Rajasthan Sculptors White Marble Version

అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించేందుకు దేవాలయ ట్రస్ట్ మూడు విగ్రహాలను తయారుచేయించింది. మూడింటినీ పరిశీలించాక కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఎంపిక చేసి గర్భాలయంలో ప్రతిష్ఠించారు. మరి మిగతా రెండు విగ్రహాల మాటేమిటి..? వాటిని ఏం చేయనున్నారనే వివరాలు తెలుసుకుందాం. సోమవారం అంగరంగ వైభవంగా బాలక్ రామ్ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల తర్వాత బాలక్ రామ్ దర్శనానికి సాధారణ ప్రజలను అనుమతిస్తున్నారు. గర్భాలయంలో కొలువుదీరిన బాలక్ రామ్ భక్తుల పూజలందుకుంటున్నాడు.

అరుణ్ యోగిరాజ్ తో పాటు రాజస్థానీ శిల్పి సత్యనారాయణ్ పాండే వైట్ మార్బుల్ రాయితో బాల రాముడి విగ్రహాన్ని చెక్కారు. ఈ పాలరాతి విగ్రహం ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. శిల్పులు ముగ్గురికీ ఒకే రకమైన కొలతలతో విగ్రహాన్ని రూపొందించాలని కమిటీ సూచించింది. దీంతో ఈ విగ్రహం కూడా 51 అంగుళాల పొడవుతో ఐదేళ్ల బాల రాముడి ప్రతిమగా రూపుదిద్దుకుంది. విగ్రహం చుట్టూ దశావతారాల ప్రతిరూపాలు, కాళ్ల దగ్గర ఎడమవైపు లక్ష్మణుడు, కుడివైపు సీతాదేవి విగ్రహాలతో బాల రాముడి విగ్రహాన్ని పాండే తీర్చిదిద్దారు. ఈ విగ్రహాన్ని పరిశీలించిన టెంపుల్ కమిటీ.. మిగతా విగ్రహాలతో పోల్చి చూసింది. చివరకు అరుణ్ యోగిరాజ్ నల్లరాతి శిల్పానికే ఓటేసింది. 

మొత్తం మూడు అంతస్తులలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ పాలరాతి విగ్రహంతో పాటు మరో శిల్పి చెక్కిన విగ్రహాన్ని మరో విగ్రహానికి కూడా చోటు కల్పించనున్నట్లు దేవాలయ కమిటీ తెలిపింది. ఏ విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలనేది ఇప్పటి వరకు నిర్ణయించలేదని పేర్కొంది. మిగతా రెండంతస్తులలో ఈ విగ్రహాలను భక్తుల సందర్శన కోసం ప్రతిష్ఠించనున్నట్లు తెలుస్తోంది. కాగా, అరుణ్ యోగిరాజ్, సత్యనారాయణ్ పాండేలతో పాటు మూడో విగ్రహం చెక్కిన మరో శిల్పి కర్ణాటకకు చెందిన గణేష్ భట్.. అయితే, భట్ చెక్కిన విగ్రహానికి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు.

More Telugu News