Komatireddy Venkat Reddy: ప్రభుత్వం పడిపోతుందంటున్నారు... మేం తలుచుకుంటే 39 ముక్కలు చేస్తాం: కేటీఆర్‌కు కోమటిరెడ్డి హెచ్చరిక

  • కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని కేటీఆర్, హరీశ్ రావులు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. పార్టీని 39 ముక్కలు చేస్తామన్న కోమటిరెడ్డి   
  • లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని జోస్యం
Minister Komatireddy warning to KTR and Harish Rao

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు మాట్లాడుతున్నారని... కానీ మేం తలుచుకుంటే బీఆర్ఎస్‌కు 39 ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీని 39 ముక్కలుగా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం ద్వారా ఎప్పుడూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం పైనే దృష్టి సారించారని ఆరోపించారు. 

కానీ నెల రోజుల్లో మేమే వారి పార్టీని ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం పడిపోయే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోస్యం చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు.

జగదీశ్ రెడ్డిపై ఆగ్రహం

జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి అన్నారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలలో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందనే అక్కసుతో తనపై ఆయన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పార్టీలో గొడవలు ఉన్నాయని... ఓ వైపు బావాబావమరిది, మరోవైపు బిడ్డ, సంతోష్ మధ్య కొట్లాట నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ వాళ్లంతా జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లే మొట్టమొదటి బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్ రెడ్డి అన్నారు.

More Telugu News