ఇకపై 'జగనన్న గారూ' అనే పిలుస్తా: వైఎస్ షర్మిల
- జగన్ రెడ్డి గారూ అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చడంలేదన్న ఏపీసీసీ చీఫ్
- రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్
- జిల్లాల పర్యటనలో భాగంగా పలాసలో బస్సులో ప్రయాణం
బస్సు ప్రయాణంలోనే షర్మిల మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ అధికారపార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. వైవీ సుబ్బారెడ్డి గారికి తాను జగన్ రెడ్డి అనడం నచ్చలేదని చెబుతూ.. ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానని సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసిన అభివృద్ధి చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా.. ఏ రోజు.. ఏ సమయంలోనైనా వచ్చి చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధిని చూపించే ధైర్యం అధికార పార్టీ నేతలకు ఉంటే వచ్చి చూసేందుకు తమతో పాటు ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రతినిధులు, మేధావులు సిద్ధమని వివరించారు.