Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరాముడికి అలంకరించిన ఆభరణాల లిస్ట్ ఇదిగో!

  • ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణంతో పాటు ఇతర శాస్త్రీయ గ్రంథాలను పరిశీలించి నగల తయారీ
  • ఆభరణాలను తయారు చేసిన లక్నోలోని ‘హర్షహైమల్ షియామ్‌లాల్ జ్యువెలర్స్’
  • విశేషంగా ఆకట్టుకుంటున్న శ్రీరాముడి వస్త్ర, ఆభరణాలు
This is the list of ornaments decorated for Sri Rama in Ayodhya

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు సోమవారం అంగరంగవైభవంగా జరిగింది. రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించగా ఆధ్యాత్మిక శోభ, సాంప్రదాయం ప్రకారం దైవిక ఆభరణాలు, ప్రత్యేక వస్త్రాలతో అలంకరించారు. ఈ ఆభరణాలను లక్నోలోని ‘శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థ’కు చెందిన ‘హర్షహైమల్ శ్యామ్‌లాల్ జ్యువెలర్స్’ తయారు చేసిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది. ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరిత్‌మానస్‌, అలవందర్ స్తోత్రం వంటి గ్రంథాలలో శ్రీరాముడి వైభవం, ధరించిన దివ్య ఆభరణాల గురించి విస్తృతమైన అధ్యయనం చేసిన తర్వాత వీటిని రూపొందించినట్టు వెల్లడించింది. 

పసుపు ధోతీ, ఎరుపు రంగు పతాక/అంగవస్త్రంతో రామ్ లల్లాను అలంకరించారు. ఈ అంగవస్త్రాలను స్వచ్ఛమైన బంగారు జరీ, దారాలతో తయారుచేశారు. ఈ దుస్తులపై శంఖం, పద్మం, చక్రం, మయూర్ వంటి వైష్ణవ చిహ్నాలు ముద్రించి ఉన్నాయి. ఈ వస్త్రాలను అయోధ్య ధామ్‌లో పనిచేసిన ఢిల్లీ టెక్స్‌టైల్ డిజైనర్ శ్రీ మనీష్ త్రిపాఠి రూపొందించారు.

ఆభరణాలు ఇవే..
విజయమాల
బంగారంతో తయారు చేసిన విజయమాలతో రామ్ లల్లాను అలంకరించారు. కెంపులతో పొదిగిన దీనిని విజయానికి చిహ్నంగా ధరిస్తారు. వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం ముద్రించి ఉన్నాయి.

భూబంధ్
బాల రాముడు రెండు చేతులతో పట్టుకున్న ఆయుధాలు. బంగారం, ఎంతో విలువైన రాళ్లతో ఈ ఆయుధాలను తయారు చేశారు. 

కంచి/కర్ధాని
ఇది బాలరాముడి నడుము చుట్టూ రత్నాలు పొదిగి ఉన్న నగ. సహజత్వం ఉట్టిపడేలా బంగారంతో దీనిని తయారు చేశారు. వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలతో దీనిని అలంకరించారు. స్వచ్ఛతకు ప్రతీకగా చిన్న గంటలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు దీనికి వేలాడుతూ ఉంటాయి.

కంగన్
అందమైన రత్నాలు పొదిగిన గాజులు. వీటిని రామ్ లల్లా రెండు చేతులకు తొడిగారు. 

ముద్రిక
రత్నాలతో అలంకరించిన ఉంగరాలు. రెండు చేతులకు వేలాడుతున్న ముత్యాలు.

ఛడ లేదా పైంజనియా
బాల రాముడి పాదాలు, బొటనవేళ్లను అలకరించిన ఆభరణాలు. వీటిని బంగారం, వజ్రాలు, కెంపులతో రూపొందించారు.

ఇక రామ్‌లల్లా ఎడమ చేతిలో ముత్యాలు, కెంపులు, పచ్చలతో అలంకరించిన బంగారు ధనుస్సు ఉంది. కుడి చేతిలో బంగారు బాణం ఉంది. మెడ చుట్టూ ప్రత్యేక నగల అలంకారం ఉంది. బాల రాముడి నుదుటిపై వజ్రాలు, కెంపులతో తయారు చేసిన సంప్రదాయక, పవిత్రమైన తిలకాన్ని అద్దారు. భగవానుడి పాదాల కింద కమలం, దాని కింద బంగారు దండ అమర్చి ఉన్నాయి. రామ్ లల్లా ఐదేళ్ల పిల్లాడు కాబట్టి వెండితో తయారు చేసిన సంప్రదాయ బొమ్మలు విగ్రహం ముందు ఉన్నాయి. గిలక్కాయలు, ఏనుగు, గుర్రం, ఒంటె, బొమ్మల బండి, స్పిన్నింగ్ టాప్ వీటిలో ఉన్నాయి. ఇక శ్రీరాముడికి ఒక బంగారు గొడుగును కూడా తలపై అమర్చారు.

More Telugu News