Canada: అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి.. కెనడా మంత్రి కీలక ప్రకటన

Canada to impose cap on international students says immigration minister
  • ఈ ఏడాది కెనడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్టడీ పర్మిట్లలో 35 శాతం మేర కోత
  • మీడియా సమావేశంలో కెనడా వలసల శాఖ మంత్రి ప్రకటన
  • అంతర్జాతీయ విద్యార్థుల వర్క్ పర్మిట్లపై కూడా పరిమితులు విధిస్తామని వెల్లడి
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో ఇళ్లు, వైద్యం, ఇతర పౌరసేవలపై భారం తగ్గే విధంగా ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను సుమారు మూడోవంతు మేర తగ్గించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కెనడా ఇమిగ్రేషన్ శాఖ మంత్రి సోమవారం కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది కేవలం 364,000 మంది అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు ఇచ్చే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే ఈమారు 35 శాతం తక్కువగా స్టడీ పర్మిట్లు జారీ కానున్నాయి. అయితే, మాస్టర్స్, డాక్టోరల్ స్టూడెంట్లు, ప్రైమరీ, సెకండరీ స్కూలు విద్యార్థులకు ఈ పరిమితి వర్తించదని ప్రభుత్వం తెలిపింది. 

వలసల విధానం సమగ్రతను, విద్యార్థుల కెరీర్‌లో విజయం, ఇళ్లకు డిమాండ్‌ను సమతులీకరించేందుకు ఈ పరిమితి విధించామని మంత్రి మార్క్ మిల్లి మాంట్రియాల్‌లో జరిగిన పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయ విద్యార్థులకు సరిపడా వనరులు లేవని తెలిసీ వారిని ఆహ్వానించడం హానికారక చర్యే. ఫలితంగా వారి కలలన్నీ చెదిరిపోయి కెనడా విద్యావ్యవస్థపై తీవ్ర అసంతృప్తితో వెనుదిరగాల్సి వస్తుంది’’ అని మంత్రి వెల్లడించారు.

అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్లపై కూడా పరిమితి విధిస్తామని అన్నారు. భారీ ఫీజులు వసూలు చేస్తూ నాణ్యమైన విద్య అందించని ప్రైవేటు, బోగస్ విద్యాసంస్థలపై కూడా ఉక్కుపాదం మోపుతామని మంత్రి హెచ్చరించారు. ‘‘నిరర్ధక డిగ్రీలు పొందిన విద్యార్థులు చివరకు క్యాబ్‌లు నడుపుకుంటూ ఉండటం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం కాదు కదా!’’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టూడెంట్ పర్మిట్ విధానం అస్తవ్యస్తంగా మారిందని, దీన్ని సరిదిద్దాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. 
Canada
cap on International students
India

More Telugu News