RC Studios: ఒకేసారి ఐదు సినిమాలు ప్రారంభించి రికార్డు సృష్టించనున్న ఆర్సీ స్టూడియోస్ బ్యానర్!

  • కన్నడ ఫిలింమేకర్ ఆర్.చంద్రు కొత్త వెంచర్ ఆర్సీ స్టూడియోస్
  • రేపు బెంగళూరులో ఐదు సినిమాలకు ప్రారంభోత్సవం
  • ఇటీవల 'కబ్జా'తో హిట్ కొట్టిన ఆర్సీ స్టూడియోస్ 
RC Studios banner will start five movies at a time

కన్నడ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్‌లతో పోటీపడుతూ ఆర్సీ (RC) స్టూడియోస్ కూడా దూసుకుపోతోంది. వారు ఇటీవల తెరకెక్కించిన మొదటి ప్రాజెక్ట్ ‘కబ్జా’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కన్నడ ఫిలింమేకర్ ఆర్.చంద్రు కొత్త వెంచర్ ఆర్సీ స్టూడియోస్ ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను తెరకెక్కించబోతోంది. 

ఆర్సీ స్టూడియోస్ రేపు ఒకేసారి 5 సినిమాలను ప్రారంభిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే బ్యానర్‌తో ఒకేరోజు 5 సినిమాలను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఈ చిత్రాలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆనంద్ పండిట్, ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, ముంబైకి చెందిన లోటస్ డెవలపర్స్ వంటి వారి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. 

RC స్టూడియోస్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ల కోసం సింగపూర్‌లోని ఇన్వెనియో ఆరిజిన్ కంపెనీకి చెందిన అలంకార్ పాండ్యన్, వ్యాపారవేత్త సీకల్ రామచంద్ర గౌడతో కలిసి నిర్మించనుంది. ఈ పాన్ ఇండియా సినిమాలపై RC స్టూడియోస్ 400 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది.

కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర కూడా ఈ సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మంగళవారం (జనవరి 23) సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరులో ఈ కార్యక్రమం జరగనుంది.

More Telugu News