IPL 2024: మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 ప్రారంభం!

  • మే 26న ఫైనల్ ఉండే అవకాశం
  • లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాక ఐపీఎల్ తేదీలను నిర్ధారించే అవకాశం
  • ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17 వరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరగనుందని పేర్కొన్న క్రిక్‌బజ్ రిపోర్ట్
IPL 2024 to starts from March 22 saying reports

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభం కానుంది. మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనుందని ‘క్రిక్‌బజ్’ రిపోర్ట్ పేర్కొంది. అయితే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున తేదీలను ఇంకా ధ్రువీకరించలేదని రిపోర్ట్ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల తేదీలకు లోబడి ఐపీఎల్ షెడ్యూల్ ఉండనుందని, ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ తేదీలు ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఐపీఎల్‌కు, పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు మధ్య చాలా తక్కువ రోజుల గ్యాప్ ఉంటుందని క్రిక్‌బజ్ రిపోర్ట్ పేర్కొంది. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17 వరకు జరగనుందని అంచనా వేసింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపింది. 

ఇక పార్లమెంట్ ఎన్నికలు ఉన్నప్పటికీ భారత్‌లోనే టోర్నీ నిర్వహించడంపై బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో ఐపీఎల్ జరగడం ఇది నాలుగవసారి కానుంది. గతంలో 2009, 2014, 2019 సంవత్సరాల్లో జాతీయ ఎన్నికల సమయంలోనే ఐపీఎల్ కూడా జరిగింది. 2009, 2014 సీజన్లలో భారత్ వెలుపల టోర్నీని నిర్వహించగా.. 2019లో ఇండియాలోనే నిర్వహించారు. ఎన్నికలతోపాటు ఐపీఎల్‌ను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. కాగా టీ20 వరల్డ్ కప్‌నకు ముందు జరగనున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ ఆటగాళ్లకు చాలా కీలకం కానుంది. అందుకే భారత ఆటగాళ్లతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మే 26న ఐపీఎల్ ఫైనల్ జరిగితే.. ఆరు రోజుల గ్యాప్‌లో జూన్ 1న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.

More Telugu News