YV Subba Reddy: షర్మిల వచ్చిందే ఇవాళ... అప్పుడే రోడ్ల గురించి మాట్లాడితే ఎలా?: వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy counters Sharmila comments on AP roads
  • నేడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల
  • ఏపీ రోడ్ల పరిస్థితిని ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై విమర్శలు
  • షర్మిల ఏపీలో అభివృద్ధిని చూడాలన్న వైవీ సుబ్బారెడ్డి
  • అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, బిల్డింగులు మాత్రమే కాదని స్పష్టీకరణ
ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిలమ్మే కాదు... ఎవరొచ్చినా తమకేం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీని ఇరకాటంలోకి నెట్టే ధైర్యం కూడా ఎవరూ చేయలేరని అన్నారు. 

"మీరు (షర్మిల) రాష్ట్రానికి వచ్చిందే మొదటిసారి. రోడ్లు ఎక్కడ వేయలేదో మీకెలా తెలుసు? నేను తెలంగాణ ఆడబిడ్డను అంటూ మొన్నటిదాకా తెలంగాణలో ఉన్నారు. పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతాను అని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రాకు వచ్చారు. వచ్చిందే ఇవాళ... రోడ్ల పరిస్థితిపై అప్పుడే మాట్లాడితే ఎలా? ఓసారి చూసి మాట్లాడండి... రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో తెలుస్తుంది. 

అభివృద్ధి అంటే ఒక్క రోడ్లు, బిల్డింగులే కాదు... పేదలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టామో చూడాలి. 2014 నుంచి చంద్రబాబు ఏమీ పట్టించుకోకపోతే, మేం వచ్చాక ఏమేం చేశామో షర్మిల అవన్నీ చూడాలి. 

ఆదాయ వనరులు పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. 3 ప్రధాన పోర్టులు నిర్మిస్తున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ప్రారంభించాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం... వీటి గురించి చెప్పుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ, మీరు పక్క రాష్ట్రం నుంచి ఈ రోజే ఏపీకి వచ్చారు. మీరక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు... ఏ కారణం వల్లో విరమించుకున్నారు. 

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నయినా రావొచ్చు... పోరాటానికి మేం సిద్ధమే. ప్రజలు మాతో ఉన్నారు. మేం చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని చాలెంజ్ చేసి చెబుతున్నాం. వైఎస్సార్ ఆశయ సాధన కోసమే స్థాపించిన పార్టీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
YV Subba Reddy
YS Sharmila
AP Roads
YSRCP
Congress
Andhra Pradesh

More Telugu News