Lalit Kumar Salve: పురుషుడిగా మారి బిడ్డకు జన్మనిచ్చిన మహారాష్ట్ర మహిళా కానిస్టేబుల్

  • 2010లో మహిళా కానిస్టేబుల్‌గా ఎంపిక
  • 25 ఏళ్ల వయసులో శరీరంలో మార్పులు గుర్తించి వైద్య పరీక్షలు
  • వై క్రోమోజోములు ఉండడంతో లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోమన్న వైద్యులు
  • రెండేళ్లపాటు పలు దఫాలుగా ఆపరేషన్లు
  • జనవరి 15న మగబిడ్డకు జన్మనిచ్చిన దంపతులు
cop who underwent sex change surgery becomes father

పురుషుడిగా మారిన ఓ మహిళా కానిస్టేబుల్ ఓ మహిళను పెళ్లాడి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగిందీ ఘటన. మజల్‌గావ్ తాలూకాలోని రాజేగావ్‌కు చెందిన లలితా సాల్వే 1988లో జన్మించారు. 2010లో మహిళా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయితే, 25 ఏళ్ల వయసులో తన శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన లలిత 2013లో వైద్య పరీక్షలు చేయించుకోగా, ఆమె శరీరంలో వై క్రోమోజోములు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు లింగమార్పిడి చేయించుకోవాలని లలితకు సలహా ఇచ్చారు. 

దీంతో లింగమార్పిడి కోసం నెల రోజుల సెలవు కావాలంటూ లలిత 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో 2018 నుంచి 2020 వరకు పలు దఫాలుగా జరిగిన సర్జరీల ద్వారా ఆమె పురుషుడిగా మారి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకున్నారు. 2020లో ఔరంగాబాద్‌కు చెందిన సీమాను వివాహం చేసుకున్నారు. తాజాగా, వీరికి ఈ నెల 15న మగబిడ్డ జన్మించారు. 

ఈ సందర్భంగా లలిత్ కుమార్ మాట్లాడుతూ.. మహిళ నుంచి పురుషుడిగా మారే క్రమంలో తన ప్రయాణం మొత్తం కష్టాలతో నిండిపోయిందని లలిత్ కుమార్ వాపోయారు. అయితే, ఈ క్రమంలో తనను ఎంతోమంది ఆదరించారని తెలిపారు. ఇప్పుడు తండ్రిని అయినందుకు సంతోషంగా ఉందని, తన కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉందని లలిత్ కుమార్ చెప్పారు.

More Telugu News