Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియోను రూపొందించిన వ్యక్తిని ఏపీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Delhi police arrests Eamani Naveen who made Rashmika deepfake video
  • రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించిన ఈమని నవీన్
  • సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వీడియో
  • దేశవ్యాప్తంగా దుమారం
  • గుంటూరు జిల్లాలో నవీన్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోను రూపొందించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఏపీలో అన్న విషయం తాజాగా వెల్లడైంది. నిందితుడ్ని ఈమని నవీన్ అని గుర్తించారు. 24 ఏళ్ల నవీన్ గుంటూరు జిల్లాకు చెందినవాడు. అసభ్యకర రీతిలో రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించి, ఆ వీడియో సోషల్ మీడియా వేదికల్లో అప్ లోడ్ చేసింది నవీనే అని వెల్లడైంది. 

ఈ  కేసు విచారణలో భాగంగా డీప్ ఫేక్ వీడియోలతో సంబంధం ఉందని భావించిన 500కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించామని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేకమంది సోషల్ మీడియా ఖాతాల సొంతదారులను విచారించామని, రష్మిక డీప్ ఫేక్ వీడియోకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించామని తెలిపారు. 

అనుమానితులను లోతుగా విచారించిన తర్వాత రష్మిక డీప్ ఫేక్ వీడియో ఓ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అప్ లోడ్ అయినట్టు గుర్తించామని డీసీపీ వివరించారు. ఒరిజినల్ వీడియో వాస్తవానికి ఓ జరా పటేల్  అనే బ్రిటీష్ మోడల్ దని, ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో 2023 అక్టోబరు 9న పోస్టు చేశారని, ఆ వీడియో ఆధారంగా రష్మిక డీప్ ఫేక్ వీడియోను రూపొందించిన అక్టోబరు 13న పోస్టు చేశారని వెల్లడించారు. 

సేకరించిన ఆధారాల ప్రకారం ఏపీలోని గుంటూరు చేరుకుని, నిందితుడు నవీన్ ఆచూకీ కనుగొన్నామని తెలిపారు. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడని డీసీపీ పేర్కొన్నారు. విచారణలో నవీన్, తాను రష్మికకు పెద్ద అభిమానినని చెప్పాడని, ఆమె పేరిట ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నిర్వహిస్తున్నట్టు తెలిపాడని వివరించారు. మరో ఇద్దరు సెలబ్రిటీల పేరిట కూడా నవీన్ ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నిర్వహిస్తున్నాడని డీసీపీ వెల్లడించారు. 

కాగా, రష్మిక డీప్ ఫేక్ వీడియో పోస్టు చేసిన అనంతరం నవీన్ నిర్వహించే ఫ్యాన్ పేజీల్లో ఒకదానికి ఫాలోవర్ల సంఖ్య 90 వేల నుంచి ఒక్కసారిగా 1.08 లక్షలకు పెరిగిపోయిందని తెలిపారు. 

అయితే, ఈ డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, సెలెబ్రిటీలు సైతం దాన్ని ఖండిస్తుండడంతో భయపడిపోయిన నవీన్... ఇన్ స్టాగ్రామ్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశాడని డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు.
Rashmika Mandanna
Deepfake Video
Eamani Naveen
Guntur District
Delhi Police
Andhra Pradesh

More Telugu News