Amit Shah: ప్రాణభయంతో భారత్ లోకి వస్తున్న మయన్మార్ సైనికులు... అమిత్ షా స్పందన

  • మయన్మార్ లో సైన్యానికి, తిరుగుబాటు దళాలకు భీకర పోరు
  • సరిహద్దులు దాటి మిజోరంలోకి ప్రవేశించిన మయన్మార్ సైనికులు
  • సరిహద్దు రాకపోకలను కట్టడి చేస్తామన్న అమిత్ షా
Amit Shah responds to Myanmar soldiers issue

అసోంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు పోలీస్ కమాండో బెటాలియన్ల శిక్షణ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

మయన్మార్ నుంచి సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని అడ్డుకుంటామని తెలిపారు. మయన్మార్ పౌరులు భారత్ లోకి యధేచ్ఛగా రాకపోకలు సాగించడంపై కేంద్రం పునరాలోచిస్తోందని వివరించారు. బంగ్లాదేశ్ తో సరిహద్దు విషయంలో ఎలా వ్యవహరిస్తున్నామో, మయన్మార్ సరిహద్దు వద్ద కూడా భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

మయన్మార్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోంది. సైన్యానికి, తిరుగుబాటు దళాలకు మధ్య భీకరపోరు కొనసాగుతోంది. మయన్మార్ సైనికులు ప్రాణాలు కాపాడుకునేందుకు సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశిస్తున్నారు. 

తాజాగా, 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దు రాష్ట్రం మిజోరంలోకి వచ్చారు. ఆశ్రయం కోసం మయన్మార్ సైనికులు వస్తున్న నేపథ్యంలోనే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News