KTR: రేవంత్ రెడ్డి లాంటి వారిని పాతికేళ్లుగా ఎంతోమందిని చూశాం!: కేటీఆర్

  • బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతున పాతిపెట్టే మాట పక్కన పెట్టి.. 100 రోజుల్లో హామీలు నెరవేర్చాలని సూచన
  • తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావ్? తెలంగాణ తెచ్చినందుకా? అని ప్రశ్న
  • రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండే కావడం గ్యారెంటీ అని వ్యాఖ్య
  • జనవరి నుంచి ప్రజలు కరెంట్ బిల్లులు కట్టకూడదంటూ పిలుపు 
KTR says brs saw many people like revanth reddy in 25 years of political career

'రేవంత్ రెడ్డి వంటి వారిని బీఆర్ఎస్ పార్టీ ఎంతోమందిని చూసింది... పాతికేళ్ళుగా ఎంతోమందిని మట్టికరిపించింది... మా పార్టీని 100 మీటర్ల లోతున పాతి పెట్టడం మాట పక్కనపెట్టి... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయడంపై దృష్టి సారించండి' బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రెండున్నర దశాబ్దాలుగా బీఆర్ఎస్ జెండా రేవంత్ రెడ్డి లాంటి వారిని మట్టి కరిపించిందన్నారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావ్? తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? లేకుంటే మిమ్మల్ని.. మీ దొంగ హామీలను ప్రశ్నించినందుకా? అని నిలదీశారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏక్‌నాథ్ షిండే కావడం గ్యారెంటీ అన్నారు. ఆయన రక్తమంతా బీజేపీదేనని... ఇక్కడ ఓ చోటా మోదీలా మారారని వ్యాఖ్యానించారు. అదానీ, రేవంత్ రెడ్డిల ఒప్పందాల అసలు గుట్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

జనవరి నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దు

జనవరి నెల కరెంట్ బిల్లులను ప్రజలు ఎవరూ చెల్లించవద్దని కేటీఆర్ సూచించారు. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లును ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. కరెంట్ బిల్లులను 10-జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి పంపించాలన్నారు. వాగ్దానం చేసినట్టుగా ప్రతి మహిళకు నెలకు రూ.2500ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల సమయం ఇస్తున్నామని.. హామీలను అమలు చేయకుంటే వదిలేది లేదని హెచ్చరించారు.

More Telugu News