దావోస్‌లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన.. ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే..!
- తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన సీఎంవో
- మూడు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసిందని ప్రకటన
- 200లకుపైగా వ్యాపార సంస్థలు, ప్రతినిధులతో మాట్లాడారని తెలిపిన సీఎం కార్యాలయం
అదానీ, జేఎస్‌డబ్ల్యూ, టాటాటెక్, బీఎల్ ఆగ్రో, సర్గ్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరాజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రియో, సిస్ట్రా, ఉబెర్ సహా పలు కంపెనీలతో చర్చలు సానుకూలంగా ముగిశాయని, ప్రత్యక్షంగా 2,500 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం హబ్‌గా మార్చడంపై రేవంత్ ప్రసంగించారని సీఎం కార్యాలయం వెల్లడించింది.
ఇక దావోస్‌కు వెళ్లడం, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెట్టుబడులు కీలకమని, పెట్టుబడుల కోసం నిరంతరం ప్రయత్నిస్తామన్నారు. ఈ వ్యాపారాలన్నింటినీ హైదరాబాద్, తెలంగాణకు స్వాగతిస్తున్నామని చెప్పారు. దావోస్ పర్యటన ముగింపు సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ విధంగా స్పందించారని ఎక్స్ వేదికగా సీఎంవో వెల్లడించింది.