Chandrababu: రాష్ట్రంలో గాలి మారుతోంది: చంద్రబాబు

  • తిరుపతి జిల్లా వెంకటగిరిలో రా కదలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • తుగ్లక్ పనైపోయిందంటూ వ్యాఖ్యలు
  • ఈ సీఎం వెయ్యి తప్పులు చేశాడని వెల్లడి
Chandrababu says they will win elections

టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లా వెంకటగిరిలో రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... రా కదలిరా అని పిలుపునిస్తే వెంకటగిరి గర్జించిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గాలి మారుతోందని అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని, రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అయినా బాగున్నాడా? ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? ఏ మహిళలైనా ఆనందంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. కనీసం సంక్రాంతి కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు.  ఇవాళ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు జీతాలు పెంచమని అడిగే పరిస్థితిలో కూడా లేరని, ఒకటో తారీఖునే జీతం వస్తుందా, లేదా అనే ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు వివరించారు. అడిగితే జైలుకు పంపుతారు కాబట్టి, అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు అని వ్యాఖ్యానించారు. 

జగన్ ను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తుగ్లక్ పనైపోయిందని అన్నారు. ఈ ముఖ్యమంత్రి వెయ్యి తప్పులు చేశారని, ఈ సీఎంను ఇంకా భరించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వ్యాపారులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారని... రాష్ట్రంలో ఏ కులం వారూ బాగా లేరని, ఇక్కడ రెడ్లు కూడా ఉన్నారని, వారి పరిస్థితి కూడా బాగా లేదని అన్నారు. ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా బాగున్నారా... అందరూ మునిగిపోయారు అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

More Telugu News