tsrtc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

  • మహిళలకే ఉచిత ప్రయాణం వివక్షేనంటూ పిటిషన్ దాఖలు చేసిన ప్రయివేటు ఉద్యోగి
  • ఉచిత పథకం వల్ల అవసర నిమిత్తం వెళ్లేవారికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్న పిటిషనర్
  • గత నెలలో జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి
Petition in High Court on free bus to women

తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు నాగోల్‌కు చెందిన ప్రయివేటు ఉద్యోగి ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. బస్సులలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని... దీంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ఉచిత పథకం వల్ల అవసర నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతోందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని కోరారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై భారం పడుతుందని... దీనిని ప్రభుత్వం భరించడం కూడా సరికాదని పేర్కొన్నారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు మహిళల ఉచిత ప్రయాణానికి వినియోగించడం సరికాదన్నారు. పై విషయాలను పరిగణనలోకి తీసుకొని ఉచిత ప్రయాణాన్ని నిలిపివేయాలని కోరారు.

More Telugu News