Harish Rao: దావోస్ వెళ్లడం దండగని గతంలో విమర్శించారు.. ఇప్పుడేం సమాధానం చెబుతారు?: హరీశ్ రావు

  • తెలంగాణ కోసం బీఆర్ఎస్ రేయింబవళ్లు కష్టపడినా.. ఎన్నికల్లో తడబడిందన్న హరీశ్ రావు
  • అధికారంలోకి రాలేమనే.. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిందని విమర్శలు
  • మా రాష్ట్రం అప్పుల్లో ఉంది.. పెట్టుబడులు పెట్టకండని చెప్పేందుకు కాంగ్రెస్ వెళ్లిందా? అని ప్రశ్న
Harish Rao interesting comments on congress

ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ఇచ్చిన గడువు వంద రోజులు కాలేదని ఆగుతున్నామని... లేదంటే చీల్చి చెండాడే వాళ్లమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ రేయింబవళ్లు కష్టపడిందని... కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తడబడిందని వ్యాఖ్యానించారు.

తన నియోజకవర్గానికి ఒక్కరూపాయి తేలేనివాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రాలేమనే ఆలోచనతోనే ఇష్టారీతిన హామీలు ఇచ్చారని... అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను తయారు చేశారని చురక అంటించారు. మన వద్ద కాంగ్రెస్ నేతలు వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై చావు వార్త చెప్పే రోజులు మరెంతో దూరంలో లేవన్నారు.

దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగేనని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారని.. మరి ఇప్పుడు వారు వెళ్లారు.. ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. దావోస్‌కు వెళ్లి మా రాష్ట్రం అప్పుల్లో ఉంది.. పెట్టుబడులు తెలంగాణలో పెట్టవద్దని చెప్పదలుచుకున్నారా? అని సెటైర్ వేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.

More Telugu News