Governor Twitter: తెలంగాణ గవర్నర్ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్..!

  • పాస్ వర్డ్ మార్చేసి సంబంధంలేని పోస్టులు పెడుతున్న దుండగులు
  • ట్విట్టర్ నుంచి మెయిల్ రావడంతో వెలుగు చూసిన హ్యాకింగ్
  • సైబర్ పోలీసులకు రాజ్ భవన్ అధికారుల ఫిర్యాదు 
Tamilisai Twitter account hacked

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి పాస్ వర్డ్ మార్చేశారు. కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించారంటూ ట్విట్టర్ కంపెనీ నుంచి గవర్నర్ కు ఓ మెయిల్ వచ్చింది. దీంతో గవర్నర్ తన ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా.. పాస్ వర్డ్ తప్పంటూ జవాబు వచ్చింది.

తన ట్విట్టర్ హ్యాండిల్ పోస్టులను పరిశీలించిన గవర్నర్.. అందులో తనకు సంబంధంలేని పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. ఈ విషయంపై రాజ్ భవన్ సిబ్బందిని గవర్నర్ ఆరా తీసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రాజ్ భవన్ అసిస్టెంట్ కంప్ట్రోలర్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాఫ్తు చేపట్టినట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో రాజకీయ నేతలు సహా పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను దుండగులు హ్యాక్ చేస్తున్నారు. తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ ఖాతా కూడా హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే. మంత్రి ఖాతాను తమ కంట్రోల్ లోకి తీసుకున్న సైబర్ నేరస్థులు.. అందులో టీడీపీ, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సంబంధించిన ప్రచార వీడియోలు పోస్టు చేశారు. అనుచరులు అలర్ట్ చేయడంతో స్పందించిన మంత్రి దామోదర.. తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ కు గురైందని, అందులో పెట్టిన సందేశాలకు స్పందించవద్దని కార్యకర్తలు, నేతలకు సూచించారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ అకౌంట్లు కూడా హ్యాకింగ్ కు గురయ్యాయి.

More Telugu News