addanki dayakar: టిక్కెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డా.. అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు!: అద్దంకి దయాకర్

  • పని చేసిన కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గుర్తింపుగా పేర్కొన్న అద్దంకి దయాకర్
  • పీసీసీ ప్రెసిడెంట్‌గా నిబద్ధతతో పని చేసినందునే రేవంత్ రెడ్డిని సీఎంగా చేశారని వెల్లడి
  • తనను ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే గుర్తిస్తారన్న దయాకర్
Addanki Dayakar on MLC ticket from congress party

తనకు టిక్కెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డానని.. తన విధేయతను చూసే తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో అద్దంకి దయాకర్ పేరు ఉంది. ఈ క్రమంలో ఆయనను బిగ్ టీవీ ఇంటర్వ్యూ చేసింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పని చేసిన కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గుర్తింపుగా దీనిని తాను భావిస్తానన్నారు. పని చేసే వారికి అవకాశమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. ఏదేమైనా పార్టీ కోసం పని చేసిన తమలాంటి వారికి గుర్తింపు ఉందని భరోసా కల్పించేలా అధిష్ఠానం ప్రకటన ఉందన్నారు. 

తాను తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మంచి మెజార్టీ వచ్చేదని... కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి టిక్కెట్ రాకున్నా పని చేశానని తెలిపారు. రేవంత్ రెడ్డి గురించి చెబుతూ పీసీసీ ప్రెసిడెంట్... ఇప్పటి ముఖ్యమంత్రి అని మాట్లాడారు. అయితే తాను పీసీసీ ప్రెసిడెంట్ అని ఎందుకు అన్నానో కూడా ఆయన చెప్పారు. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఆయన నిబద్ధతతో పని చేశారని.. అందుకే సీఎం రేసులో ఎక్కువమంది ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి దక్కిందని, అందుకే ఆయనను పీసీసీ ప్రెసిడెంట్ అని అంటున్నానని తెలిపారు.

పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాను పని చేశానన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వని పలు సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశానని గుర్తు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసమే పని చేశానన్నారు. టిక్కెట్ రానివారు చాలామంది పార్టీని వీడి వెళ్లారని.. ఆ పరిస్థితుల్లో తాను కూడా వెళతానని చాలామంది భావించారని చెప్పారు. కానీ తాను పార్టీ కోసమే పని చేశానన్నారు. అద్దంకి దయాకర్ అంటే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తుకు వస్తారన్నారు.

More Telugu News