YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం

  • కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల
  • ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటన
  • ఇటీవలే ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు
  • రుద్రరాజుకు వర్కింగ్ కమిటీలో స్థానం కల్పించిన హైకమాండ్
AICC appoints YS Sharmila as AP PCC Chief

అనుకున్నదే జరిగింది! వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. 

అంతేకాదు, షర్మిలకు మార్గం సుగమం చేస్తూ, ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజుపై కాంగ్రెస్ హైకమాండ్ ఉదారంగా స్పందించింది. ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. 

ఇక, ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల రాక వెనుక చాలా జరిగింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో షర్మిల తన పార్టీని ఎన్నికల బరికి దూరంగా ఉంచారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో, షర్మిల త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గుర్తించింది. ప్రతిఫలంగా ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో, షర్మిల నియామకం లాంఛనమేనని తెలిసిపోయింది. ఈ క్రమంలో, షర్మిల నియామకంపై కాంగ్రెస్ పార్టీ నుంచి నేడు అధికారిక ప్రకటన వెలువడింది.  

More Telugu News