G. Kishan Reddy: నెహ్రూ నుంచి నేటి వరకు కాంగ్రెస్‌లో హిందూ వ్యతిరేకత!: కిషన్ రెడ్డి

  • నాడు సోమనాథ్ మందిర పునరుద్ధరణకు నెహ్రూ అడ్డుపడ్డారన్న కిషన్ రెడ్డి
  • నేడు రామమందిర ప్రాణప్రతిష్ఠలో అదే పద్ధతిలో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పై ఆగ్రహం
  • లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోనుందన్న కిషన్ రెడ్డి
Kishan reddy alleges Congress is anti hindu

ప్రధానమంత్రి హోదాలో ఉండి నాడు జవహర్ లాల్ నెహ్రూ సోమనాథ్ మందిర పునరుద్దరణకు అడ్డుపడ్డారని... నేడు రామమందిర ప్రాణప్రతిష్ఠ విషయంలో కాంగ్రెస్ అదే పద్ధతిలో వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందని ఆరోపించారు. మొదటి నుంచీ బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ హిందూ వ్యతిరేకిగా మారిందన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పటికీ క్షమించరన్నారు.

నాడు సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని... అలాంటి వ్యక్తి సోమనాథ్ మందిర పునరుద్ధరణ చేస్తామంటే నెహ్రూ అడ్డుపడ్డారని, పునరుద్ధరణ కార్యక్రమానికి వెళతామంటే రాష్ట్రపతిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో అధికారం కోల్పోయిందని... ప్రస్తుతానికి మూడు రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అయినా ఆ పార్టీ కుహనా సెక్యులరిజాన్ని వదలడం లేదన్నారు. తన హిందూ వ్యతిరేకతను బయటపెట్టుకున్న కాంగ్రెస్ రానున్న రోజుల్లో మరింతగా పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.

More Telugu News