Amitabh Bachchan: అయోధ్యలో భూమి కొన్న అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan Buys Land In Ayodhya For Rs 14 and Half Crore
  • ముంబైకి చెందిన డెవలపర్ ప్రాజెక్టులో ప్లాట్ కొనుగోలు
  • రామ మందిరానికి సమీపంలో సరయూ ప్రాజెక్టు
  • 2028 కల్లా డెవలప్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడి
రామ మందిరం నిర్మాణంతో అయోధ్యలో రియల్ ఎస్టేట్ బూమ్ ఏర్పడింది. శ్రీ రాముడు నడయాడిన ప్రాంతంలో భూమి కొనుగోలు చేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఓ ప్లాట్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఆయన పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామ మందిరానికి పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాజెక్టులో బిగ్ బీ ప్లాట్ కొన్నట్లు తెలుస్తోంది.

ముంబైకి చెందిన డెవలపర్ ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఏబీఎల్)’ అయోధ్యలో సరయూ పేరుతో 51 ఎకరాలలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. 2028 నాటికల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ యాజమాన్యం వెల్లడించింది. తమ ప్రాజెక్టులో మొదటి ప్లాట్ ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేయడంపై సంతోషం వ్యక్తం చేసింది. కాగా, బిగ్ బీ కొన్న ప్లాట్ విస్తీర్ణం వివరాలు కానీ, ప్లాట్ ధరకు సంబంధించిన వివరాలు కానీ కంపెనీ వెల్లడించలేదు.

అమితాబ్ బచ్చన్ కూడా ఈ విషయం తన ట్వీట్ లో వెల్లడించలేదు. ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బిగ్ బీ కొన్న ప్లాట్ 10 వేల చదరపు గజాలు, దీనికి ఆయన వెచ్చించిన సొమ్ము రూ.14.5 కోట్లు అని తెలుస్తోంది. బిగ్ బీ పుట్టిన ఊరు ప్రయాగ్‌రాజ్ కు ఈ ప్రాంతం నాలుగు గంటల ప్రయాణం దూరంలో ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో హెబీఏబీఎల్ చేపట్టిన ప్రాజెక్టులో భాగస్వామిని కావడం సంతోషాన్ని కలిగిస్తోందని, ప్రాజెక్టు పూర్తయ్యే క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. అయోధ్య నగరానికి తన గుండెల్లో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు.
Amitabh Bachchan
Buys Land
Ayodhya
HoBAL
Real Estate
Ayodhya City
Prayagraj

More Telugu News