Metro: సంక్రాంతి వేళ హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్... మూడ్రోజులు అన్ లిమిటెడ్ ప్రయాణం

  • సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు జనాలు పయనం
  • బోసిపోయినట్టుగా కనిపిస్తున్న భాగ్యనగరం
  • ఆక్యుపెన్సీ పెంచుకునేందుకు హైదరాబాద్ మెట్రో కొత్త ప్లాన్
  • సూపర్ సేవర్ కార్డుపై అన్ లిమిటెడ్ ప్రయాణ సదుపాయం
Hyderabad Metro announces bumper offer

సంక్రాంతి వచ్చిందంటే జనాల్లో జోష్ మామూలుగా ఉండదు. భోగి, సంక్రాంతి, కనుమ... ఇలా మూడ్రోజులూ ఎంతో విశిష్టత ఉన్న పర్వదినాలు కావడంతో సంబరాలకు కొదవ ఉండదు. 

ఇక, హైదరాబాదులో అయితే ఈ మూడ్రోజులు సెలవు దినాలు కావడంతో ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లిపోతారు. దాంతో నగరం చాలావరకు ఖాళీగా కనిపిస్తుంది. ఈసారి కూడా అందులో పెద్ద తేడా లేదు. నగరం బోసిపోయినట్టు కనిపిస్తోంది. చూద్దామన్నా రోడ్లపై రద్దీ కనిపించడంలేదు. 

ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని పెంచుకోవడం కోసం... అన్ లిమిటెడ్ ప్రయాణ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. సూపర్ సేవర్ కార్డును రూ.59తో రీచార్జ్ చేయించుకుంటే చాలు... మెట్రోలో ఒక రోజంతా ఎక్కడ్నించి ఎక్కడికైనా అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. 

మెట్రో రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సూపర్ సేవర్ కార్డులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ కార్డులను ఎప్పటినుంచో ఇస్తోంది. ఈ కార్డును ఒకసారి కొనుగోలు చేయాలంటే రూ.109 చెల్లించాలి. ఇప్పుడు ఈ కార్డును రూ.59తో రీచార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ ప్రయాణ సౌకర్యాన్ని పొందుతారు.

More Telugu News