Amazon: అమెజాన్ అడవుల్లో బయటపడిన ప్రాచీన నగరం

  • అనేక దేశాల పరిధిలో విస్తరించి ఉన్న అమెజాన్ అడవులు
  • తూర్పు ఈక్వెడార్ ప్రాంతంలో పురాతన నగరం గుర్తింపు
  • 2,500 ఏళ్ల నాటి నగరంగా భావిస్తున్న పరిశోధకులు
Archaeologists found Ancient City in great Amazon forest

పలు దక్షిణ అమెరికా దేశాల పరిధిలో దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే మహారణ్యం అమెజాన్. ఈ వర్షారణ్యం అనేక జీవజాతులకు, ఆదిమ తెగలకు ఆవాసంగా ఉంది. అంతేకాదు, అనేక నాగరికతలు, సంస్కృతులకు పుట్టినిల్లుగానూ అమెజాన్ కు పేరుంది. 

కాగా, అమెజాన్ అడవిలో ఓ ప్రాచీన నగరం బయల్పడింది. ఇది 2,500 ఏళ్ల నాటి నగరం అని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఇది ఎవరి కంట పడకుండా ఉంది. తూర్పు ఈక్వెడార్ పరిధిలోని దట్టమైన అమెజాన్ వన సీమల్లో దీనిని గుర్తించారు. 

ఇళ్లు, భవనాలు, వీధులను కలుపుతూ నెట్వర్క్ రోడ్లు, కాలువలతో ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆ నగరాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ రోజుల్లోనే అవి ఆధునిక నిర్మాణాలు అని చెప్పదగిన విధంగా ఆ కట్టడాలు ఉన్నాయి. ఫ్రాన్స్ కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఈ ప్రాచీన నగరాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. 

ఈ నగరం దాదాపు 1000 ఏళ్ల పాటు మనుగడ సాగించి, ఆపై క్రమంగా అంతరించిపోయినట్టు భావిస్తున్నారు. ఈ పురాతన నగరంలో ఎంతమంది జీవించారనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికీ... సుమారుగా 10 వేల మంది నుంచి లక్ష మంది వరకు జీవించి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

అసలీ నగరాన్ని ఎలా కనుగొన్నారంటే... శాస్త్రవేత్తలు ఓ విమానంలో లేజర్ సెన్సర్లు ఉంచి అమెజాన్ అడవులపై దాదాపు 300 చదరపు కిలోమీటర్ల మేర శోధించారు. ఈ లేజర్ సెన్సర్లు సేకరించిన సమాచారంతో సమన్వయం చేసుకుంటూ తవ్వకాలు సాగించిన పురావస్తు పరిశోధకులు దట్టమైన అడవి కింద భాగంలో ఉన్న నగరాన్ని గుర్తించారు.

More Telugu News