Karnataka Rape Case: మతాంతర వివాహం చేసుకున్న ముస్లిం మహిళపై కర్ణాటక హోటల్ లో దాడి.. సామూహిక లైంగికదాడి!

7 Karnataka Men Who Assaulted Interfaith Couple Three Arrested
  • హోటల్‌లోకి దూసుకెళ్లి మహిళను ఈడ్చుకెళ్లిన ముస్లిం యువకులు
  • నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడి!
  • లైంగికదాడికి యత్నిస్తున్న నిందితులకు సంబంధించిన వీడియో వైరల్
కర్ణాటకలో హవేరి జిల్లాలో ఓ హోట్‌ల్‌లో ముస్లిం యువతిపై సామూహిక లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ముస్లిం యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మతాంతర వివాహం చేసుకున్న ముస్లిం యువతి తన భర్తతో కలిసి హోటల్‌లో ఉండగా చొరబడిన యువకులు వారిపై దాడిచేశారు. ఈ నెల 7న జరిగిన ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకులు యువతిపై దారుణానికి పాల్పడుతున్న వైనాన్ని చిత్రీకరించడంతో, ఆ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. 

హోటల్‌ గదిలోకి చొరబడి.. దంపతులను చావబాది
 తాజా కేసు విషయానికి వస్తే దంపతులు ఉన్నహోటల్ రూములోకి బలవంతంగా ప్రవేశించిన దుండగులు మహిళను హోటల్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. అనంతరం కారులో ఎక్కించుకుని నదీ ప్రాంతానికి తీసుకెళ్లి చావబాది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. కారు డ్రైవర్ కూడా తనపై లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ తర్వాత ఆమెను ఒక బస్టాప్ వద్ద వదిలిపెట్టారు.

దాడి ఘటనను చిత్రీకరించిన నిందితులు
నిందితుల పేర్లు తనకు తెలియవని, కాకపోతే అందులో ఒకడిని అఫ్తాబ్ అని మిగతావారు పిలవడం విన్నానని బాధితురాలు తెలిపింది. వారిని కనుక తన ఎదుట నిలబెడితే గుర్తించగలనని పేర్కొంది. వీడియోలో వారు స్పష్టంగా కనిపిస్తున్నారని, వారందరూ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్టు వీడియోలో ఆమె అభ్యర్థించింది. హోటల్ రూములోకి ప్రవేశించిన నిందితులు బాధితులపై దాడి ఘటనను చిత్రీకరించారు. బాధితురాలు చేసిన లైంగికదాడి ఆరోపణలపై కేసు నమోదు చేసినట్టు హవేరి ఎస్పీ అన్షు కుమార్ తెలిపారు. అయితే, బాధితురాలు తొలుత అత్యాచారం ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు.

అత్యంత భయానకమన్న బీజేపీ
మహిళ పేర్కొన్న ఏడుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. మిగిలిన నిందితుడిని కూడా అరెస్ట్ చేస్తామని వివరించారు. ఈ ఘటన కర్ణాటకలో రాజకీయంగానూ దుమారం రేపింది. ఇది ‘అత్యంత భయానకం’ అని కర్ణాటక బీజేపీ చీఫ్ వీవై విజయేంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు.
Karnataka Rape Case
Gang Rape
Interfiath Couple

More Telugu News