Kesineni Nani: విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు: కేశినేని నాని

  • మూడో జాబితా విడుదల చేసిన వైసీపీ
  • నిన్ననే సీఎం జగన్ ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని
  • ఇవాళ మూడో జాబితాలో విజయవాడ ఇన్చార్జిగా ఆయన పేరు
Kesineni Nani thanked CM Jagan

టీడీపీ నాయకత్వంపై అలకబూని వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇవాళ వైసీపీ నాయకత్వం విడుదల చేసిన మూడో జాబితాలో కేశినేని నానిని విజయవాడ పార్లమెంటు స్థానం ఇన్చార్జిగా నియమించారు. దీనిపై కేశినేని నాని స్పందించారు. 

వైసీపీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ కేశినేని నాని పేర్కొన్నారు.

"మీ నాయకత్వంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను" అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

గతకొంతకాలంగా టీడీపీ నాయకత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కేశినేని నాని... చంద్రబాబు నన్ను వద్దనుకుంటున్నారు... ఆయనే వద్దనుకుంటున్నప్పుడు ఇంకా పార్టీలో కొనసాగడంలో అర్థంలేదు అని ఇటీవల ఓ ప్రకటన చేశారు. తండ్రి బాటలోనే విజయవాడ కార్పొరేటర్ కేశినేని శ్వేత కూడా టీడీపీ నుంచి బయటికి వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. 

నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన కేశినేని నాని... చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, జగన్ తనకు బాగా నచ్చారని, త్వరలోనే వైసీపీలో చేరుతున్నానని ప్రకటించారు. కేశినేని నాని ఇంకా వైసీపీలో చేరకముందే ఆ పార్టీ ఇన్చార్జిల జాబితాలో ఆయన పేరును చేర్చారు.

More Telugu News