Mukesh Kumar Meena: 5.64 లక్షల పేర్లను అనర్హమైనవిగా గుర్తించాం: ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

  • ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం
  • కాకినాడలో పెద్దమొత్తంలో ఓట్లను చేర్చుతున్న 13 మందిపై కేసు
  • గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్
  • ఇప్పటివరకు 50 మంది బీఎల్వోలపై చర్యలకు ఆదేశాలు
AP CEO Mukesh Kumar Meena press meet on voter list

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఓట్ల నమోదుకు సంబంధించి డిసెంబరు 9 వరకు వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని చెప్పారు. డిసెంబరు 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12 లోగా పరిష్కరిస్తామని తెలిపారు. 

రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో, 14.48 లక్షల పేర్లను పరిశీలించి... 5,64,819 పేర్లను అనర్హమైనవిగా గుర్తించామని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను కలెక్టర్లు తొలగించారని స్పష్టం చేశారు. 

కాకినాడలో ఒకేసారి పెద్దమొత్తంలో ఓటర్లను చేర్చుతున్న 13 మందిపై కేసు నమోదు చేశామని మీనా తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వివరించారు. 

చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశామని, 24 మంది బీఎల్వోలపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే పర్చూరు ఈఆర్ఓ, సీఐ, ఎస్ఐ సస్పెండ్ అయ్యారని వెల్లడించారు. ఉరవకొండ, ప్రొద్దుటూరు ఈఆర్ఓలు సస్పెండ్ అయ్యారని వివరించారు. 

ఈసీ క్రమశిక్షణ చర్యలకు గురైన వారు ఎన్నికల్లో విధుల్లో ఉండరని మీనా స్పష్టం చేశారు. ఇప్పటివరకు 50 మంది బీఎల్వోలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

More Telugu News