Kanakamedala Ravindra Kumar: టీడీపీ పుస్తకంలోని అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం సీఎంకి ఉందా?: కనకమేడల

  • మంగళగిరిలో కనకమేడల రవీంద్రకుమార్ మీడియా సమావేశం
  • ఇచ్చిన హామీల్లో జగన్ అమలు చేసింది 15 శాతమేనని వ్యాఖ్య  
  • రాష్ట్ర విభజన నష్టం కంటే జగన్ పాలనలో నష్టమే ఎక్కువని విమర్శలు
  • అమరావతిపై 2024 ఎన్నికల్లో ప్రజలకు ఏం చెబుతారన్న కనకమేడల
Kanakamedala challenges CM Jagan on TDP Book

’85 శాతం హామీల అమల్లో జగన్ రెడ్డి ఫెయిల్’ అన్న టీడీపీ పుస్తకంలోని అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. హామీల అమలుకు సంబంధించిన వాస్తవాలు వెల్లడించాకే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఓట్లు అడగాలని కనకమేడల స్పష్టం చేశారు. 

నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో జగన్ రెడ్డి అమలు చేసింది కేవలం 15 శాతమేనని అన్నారు. నాలుగేళ్ల 9 నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంతృత్వం, అవినీతి, అబద్ధాలమయం అని కనకమేడల విమర్శించారు. 99 శాతం హామీలు అమలు చేశామంటూ ప్రజల్ని మోసగించడం కాదు... ముందు టీడీపీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. 

మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, ప్రత్యేకహోదా, 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అంగన్ వాడీ, మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి నిర్మాణాల మాటేమిటి? ఏటా ప్రతి రైతుకి ఇస్తామన్న రూ.12,500ల సంగతేమిటి? అని నిలదీశారు. 

"పోలీస్ వ్యవస్థతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్ లేదు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి విముక్తి, ప్రజలకు సంతోషం" అని కనకమేడల పేర్కొన్నారు. 

"వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రజలకు చెప్పే పరిస్థితి వచ్చింది. తమ దాకా వస్తే గానీ వాస్తవం అర్థం కాదన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో... ఇచ్చిన హామీలు అమలు చేయనందున, ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని బహిరంగంగానే చెబుతున్నారు. దీనికంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి  ప్రజల్ని మోసగించడమే. 

25 మంది ఎంపీలను గెలిపిస్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి పరిశ్రమలు వచ్చేలా చేసి, యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం కాదా? హోదా కోసం ఎప్పుడైనా పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు పోరాడారా? మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వారు... చివరకు కేంద్రం ముందు మెడలు వంచింది నిజం కాదా? 

అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమరావతి నిర్మాణానికి సమ్మతించిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట మార్చాడు? చివరకు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. అమరావతి ప్రాంతాన్ని అడవిలా మార్చారు. రాజధానిలోని రూ.10 వేలకోట్ల విలువైన నిర్మాణ సామగ్రిని వృథా చేశారు. మూడు రాజధానుల ఆలోచన తెరపైకి తెచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. 

అమరావతి నిర్మాణం విషయంలో ఎందుకిలా చేశారో, ఇంతకుముందు ఇలా చెప్పామని, అధికారంలోకి వచ్చాక ఇలా చేశామని, రేపు మరలా అధికారంలోకి వస్తే ఇలా చేస్తామని 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పగల ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా?" అంటూ కనకమేడల సవాల్ విసిరారు.

More Telugu News