Front Desk: 2 నిమిషాల వీడియో కాల్ మాట్లాడి.. 200 మందిని తొలగించిన ఫ్రంట్ డెస్క్ సీఈవో

  • కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన స్టార్టప్ కంపెనీ
  • సంస్థ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను వివరించిన సీఈవో
  • అమెరికాలో దివాలా తీసిన ‘ఫ్రంట్ డెస్క్’ కంపెనీ
American Startup Firm Fires All 200 Employees In A 2 Minute Video Call

అమెరికాలో మరో కంపెనీ దివాలా తీసింది. ఆర్థికంగా కుదేలైన స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులందరినీ ఏకకాలంలో తొలగించింది. ఈమేరకు నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు వీడియో కాల్ చేసిన కంపెనీ సీఈవో అందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. ఉన్నట్టుండి ఉద్యోగం ఊడడంతో 200 మంది ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అమెరికాలోని ప్రముఖ స్టార్టప్ కంపెనీ ‘ఫ్రంట్ డెస్క్’ ఉద్యోగులకు ఎదురైందీ పరిస్థితి.

అమెరికాలోని వ్యాపారవేత్తలతో పాటు విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు వెలిసిన స్టార్టప్ కంపెనీయే ‘ఫ్రంట్ డెస్క్’.. సంస్థ ప్రారంభించిన కొత్తలోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2017లో ప్రారంభించిన ఈ కంపెనీ అమెరికాలో దాదాపు వెయ్యికి పైగా ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్ మెంట్లను నిర్వహిస్తోంది. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటోంది. అయితే, ప్రత్యర్థి కంపెనీలను కొనేందుకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించడంతో కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దీంతో ప్రముఖ సంస్థల నుంచి దాదాపు 28 మిలియన్ డాలర్లను ‘ఫ్రంట్ డెస్క్’ సేకరించింది. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ఫ్రంట్ డెస్క్ సీఈవో జెస్సీ డిపంటో ఉద్యోగులకు గూగుల్ మీట్ ద్వారా వీడియో కాల్ చేశారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ రెండు నిమిషాలు మాట్లాడారు. స్టేట్ రిసీవర్ షిప్ కోసం దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. ఆపై ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కాంట్రాక్టర్లతో పాటు మొత్తం 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.

More Telugu News