Polar Bear: బర్డ్‌ఫ్లూతో మృతి చెందిన ధ్రువపు ఎలుగుబంటి.. ప్రపంచంలో ఇదే తొలికేసు!

  • అలాస్కాలో గత డిసెంబరులో ఎలుగుబంటి మృతి
  • ఇన్ఫెక్షన్‌కు గురైన పక్షుల కళేబరాల ద్వారా దానికి సోకి ఉంటుందని అనుమానం
  • మరిన్ని ధ్రువపు ఎలుగులకు ముప్పు
Polar Bear died with bird flu first case in world

బర్డ్‌ఫ్లూకు కారణమైన హెచ్5ఎన్1 వైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకిన వేళ ఓ ధ్రువపు ఎలుగుబంటి దాని బారినపడి మృతి చెందడం కలకలం రేపింది. బర్డ్‌ఫ్లూతో ఓ ధ్రువపు ఎలుగుబంటి మృతి చెందడం ప్రపంచంలోనే ఇదే తొలిసారని అలాస్కా పర్యావరణ పరిరక్షణ విభాగాన్ని ఉటంకిస్తూ ‘ది గార్డియన్’ పేర్కొంది. గతేడాది డిసెంబరులో ఇది ఉత్కియాగ్విక్‌లో మృతి చెంది కనిపించింది. 

ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల కళేబరాల నుంచి దానికి బర్డ్ ఫ్లూ సోకి ఉంటుందని అలాస్కా పశువైద్య నిపుణుడు ఒకరు తెలిపారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్‌లిస్ట్‌లో ధ్రువపు ఎలుగుబంట్లు అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా మంచు వేగంగా కరిగిపోతుండడంతో ఐయూసీఎన్ వీటిని అంతరించిపోయే జంతువుల జాబితాలో చేర్చింది. కాగా, హెచ్5ఎన్1 వైరస్ కారణంగా మరిన్ని ధ్రువపు ఎలుగుబంట్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పశువైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

2021లో వెలుగు చూసిన హెచ్5ఎన్1 వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పక్షులు మరణిస్తాయని అంచనా వేశారు. 2022 నాటికి ఈ వైరస్ 80కిపైగా దేశాలకు పాకింది. ఈ వైరస్ తొలుత అటవీ జల పక్షుల నుంచి వ్యాప్తి చెందింది. ఆ తర్వాత పౌల్ట్రీ, ఇతర పక్షి జాతులకు ముప్పుగా పరిణమించింది. బ్లాక్, బ్రౌన్ ఎలుగుబంట్లు సహా వేలాది జంతువులు ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డాయి. ఇటీవలి కాలంలో అలాస్కాలో బట్టతల గద్దలు, నక్కలు, కిట్టీవేక్స్ పక్షులు మృతి చెందాయి. అయితే, ధ్రువపు ఎలుగుబంటి మృతి చెందడం మాత్రం ఇదే తొలిసారి.

More Telugu News