Mega DSC: అవనిగడ్డలో రోడ్డెక్కిన డీఎస్సీ అభ్యర్థులు... ఉద్రిక్తత

  • మెగా డీఎస్సీ ప్రకటించాలన్న అభ్యర్థులు
  • లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని అల్టిమేటం
  • అవనిగడ్డ బస్టాండ్ సెంటర్ లో మానవహారం
  • సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
  • డీఎస్సీ అభ్యర్థులను తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులు
DSC Candidates protests in Avanigadda

మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చారు. బస్టాండ్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 

వెంటనే డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆపేది లేదని అన్నారు. ఈ ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి, మన బిడ్డలు కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు... నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పి, దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశాడు అంటూ డీఎస్సీ అభ్యర్థులు మండిపడ్డారు. విద్యార్థులు చదువుకోవడం వల్లే నిరుద్యోగుల శాతం పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి అంటున్నాడని, ఆయన అలా అనడానికి సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఎస్సీ అభ్యర్థులు రోడ్డుపై ఆందోళనకు దిగిన నేపథ్యంలో, పోలీసులు వారిని వాహనాల్లో ఎక్కించి అక్కడ్నించి తరలించేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాగా, డీఎస్సీ అభ్యర్థుల నిరసన ప్రదర్శనకు టీడీపీ నేతలు మద్దతు పలికారు. 

More Telugu News